నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 20 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో గల మొదటి అంతస్తులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూం లో మంటలు లేచాయి. పొగ పెద్ద ఎత్తున రావడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో అని భయపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పై అంతస్తులోని వార్డుల్లోని రోగులను కిందకు దించారు. రోగులు పక్కవార్డులో ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. పొగ రోగుల వార్డుల్లోకి వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గదిలోని ఫర్నీచర్, వస్తువులు కాలిపోయాయి. కంప్యూటర్ పరికరాలు మసిబారాయి. ఆసుపత్రిని ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా వైద్యాధికారి రాజేందర్, అధికారులు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. విద్యుత్ మరమ్మతులు చేశారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాల్సింగ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఆర్ఎంవో సమత ఉన్నారు.