కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, తెల్లబంగారం బుగ్గిపాలవుతున్నది. నిర్వాహకుల నిర్లక్ష్యమో.. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమో తెలియదుగాని ఈ 20 రోజుల్లో మూడుచోట్ల ఘటనలు జరిగి రూ. 23 లక్షల దాకా నష్టపోవాల్సి వచ్చింది.
ఆసిఫాబాద్ జిల్లాలో 17 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. 20 రోజుల్లో మూడుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. పత్తి నిల్వలతో వచ్చిన వాహనాల సైలెన్సర్లు వేడెక్కి వాటి నుంచి వచ్చిన నిప్పురవ్వలే ప్రమాదాలకు కారణమయ్యాయి. ఈ నెల 9న వాంకిడిలోని జిన్నింగ్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. సుమారు రూ. లక్ష వరకు నష్టం జరిగింది.
మంటలు చెలరేగిన వెంటనే అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అలాగే 20న జైనూర్లోని జిన్నింగ్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 200 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇక ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి సుమారు 30 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. సుమారు 30 క్వింటాళ్ల పత్తి కాలిపోయినట్లు తెలుస్తుండగా, సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వచ్చినట్లు అంచనా.
రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసే జి న్నింగ్ మిల్లుల నిర్వాహకులు, అధికారులు అప్రమత్తంగా ఉండడం లేదనే విమర్శలు వ స్తున్నాయి. పత్తి నిల్వ ఉంచే చోట చిన్న నిప్పు రవ్వ పడినా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంటుంది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించే సమయంలోనే ఫైర్ సేప్టీ ప్రమాణాలను అధికారు లు విధిగా పరిశీలించాల్సి ఉంటుంది. జిన్నింగ్ మిల్లులో ఫైర్ సేప్టీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పత్తి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలి.
అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని మాపక కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఇటీవల జైనూర్లోని జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరగగా, అగ్ని మాపక యంత్రం అక్కడికి చేరుకునేలోపే భారీ నష్టం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి జైనూర్ మండల కేంద్రం దాదాపు 55 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్నిమాపక వాహనం వెళ్లడానికి కనీసం గంట సమయమైనా పడుతుంది. అగ్నిమాపక యంత్రం అక్కడి చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
జిన్నింగ్‌లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పత్తి కొనుగోళ్లకు అనుమతి ఇస్తాం. అన్ని జిన్నింగ్‌లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూనే పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి పత్తి అమ్మేందుకు తీసుకువచ్చే వాహనాల కండిషన్ బాగా లేకపోవడం, సైలెన్సర్‌కు తడిపిన గోనెసంచి కట్టిన తర్వాతే మిల్లులోకి వాహనాలు రావాలి. ఒక్కోసారి ఇలాంటి నిబంధన పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.
సైలెన్స్ర వేడితో పాటు వాహనాలు స్టార్ట్ చేసేటప్పుడు కూడా నిప్పు రవ్వలు పడే అకాశం ఉంటుంది. జిల్లాలో ఇప్పటి వరకు జిన్నింగ్‌లలో జరిగిన అగ్ని ప్రమాదాలు అలాంటివే. ఒక్కోసారి మిషనరీలో కలిగే సాంకేతిక లోపాల వల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. జిన్నింగ్‌లలో పత్తి నిల్వలు ఉండే చోట అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నీళ్లు అందుబాటులో ఉంచుతున్నాం. – పన్నాలాల్, సీసీఐ సీపీవో