తాండూర్ : సృష్టిలో కమ్మనైననది స్నేహం. సంతోషం వచ్చినా, కష్టంవచ్చినా తామున్నామంటూ ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. చిన్నతనంలో కలిసి చదువుకున్న ఓ స్నేహితుడు అనారోగ్యానికి గురై మంచాన పడ్డ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ( Alumni ) అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు.
తాండూరు మండలం తంగళ్ల పల్లి గ్రామానికి చెందిన అలివేణి మల్లేష్ ( Mallesh ) 1998 -99 సంవత్సరం వరకు తాండూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు . ఆ తరువాత జీవన ఉపాధి కోసం డ్రైవర్ రంగాన్ని ఎంచుకుని, మంచిర్యాలలో అద్దె ఇంట్లో ఉంటూ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో కాంట్రాక్టు డ్రైవర్‌గా ( Contract Driver ) ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాడు .
విధి వక్రించి మల్లేష్ క్యాన్సర్ బారిన పడి మంచాన పడ్డాడు. ప్రస్తుతం బయటకు వెళ్లలేక, ఏ పని చేయలేక ఇంట్లో ఉంటున్నాడు. కుటుంబ పోషణ భారం కావడం మరోవైపు ఆరోగ్యం సహకరించకపోవడం, ఆర్థిక పరిస్థితి అంతతమాత్రంగా ఉండడంతో చేసేదేమీ లేక సతమతమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో 98-99 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు అందరూ కలిసి సమావేశాన్ని ఏర్పరచుకుని ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చారు. అందరు స్నేహితులు కలిసి మల్లేష్ కుటుంబానికి రూ. 50 వేల నగదుతో పాటు నిత్యవసర సరుకులను అందజేసి మానవత్వాన్ని, స్నేహం విలువను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆదుకున్న స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు.