నిర్మల్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : వానకాలం ప్రారంభమై ఆశించిన వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఆరుతడి పంటలైన పత్తి, సోయా, మక్కను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఆయా పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. ఈ వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఇందుకోసం 49వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల ఎరువులు కలిపి 13,796 ఎంటీఎస్ మాత్ర మే అందుబాటులో ఉన్నాయి. అంటే 25 శాతం ఎరువులు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత శనివారం ముథోల్ మండలంలోని ఆష్టా పీఏసీఎస్‌లో కేవలం 400 బస్తాల యూరియా అందుబాటులో ఉండడం తో 150 మందికి పైగా రైతులు ఎగబడ్డారు. ఉన్న కొద్దిపాటి యూరియాను దక్కించుకునేందుకు రైతు లు పడరాని పాట్లు పడ్డారు.
ఉదయం 6 గంటల నుంచే పీఏసీఎస్ కేంద్రం వద్ద తమ చెప్పులను క్యూ లో ఉంచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం కూడా బాసర మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట కూడా రైతులు బారులుదీరారు. గత ఉమ్మడి రాష్ట్రంలో చెప్పులను క్యూ లో పెట్టడాన్ని చూశాం. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడు కూడా ఈ దుస్థితి రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాతరోజులు వచ్చాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రైతులు తమ పంట భూముల్లో దుక్కి దున్నిన తర్వాత విత్తనాలు వేసేముందు అడుగు మందుగా డీఏపీ వేస్తారు.
జిల్లాలో డీఏపీ ఆరు వేల మెట్రిక్ టన్నుల వరకు అవసరముంటుందని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను పంపింది. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 1,308 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉన్నది. దీంతో డీఏపీ కొరత కారణంగా రైతులు సాగు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ముందుచూపు లేని కారణంగానే ఎరువుల కొరత సమస్యతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాగా.. పత్తి విత్తనాలు ఉండగా.. మక్క, సోయా, పప్పు దినుసుల విత్తనాలు లేవంటున్నారు. అలాగే పచ్చి రొట్ట విత్తనాలు కూడాలేవు.
నాకు ఆలూర్ శివారులో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఈ వానకాలం సీజన్లో ఆరెకరాల్లో సోయా, రెండెకరాల్లో పత్తి, 12 ఎకరాల్లో వరి సాగు చేయాలనుకుంటున్న. ఈసారి వానలు ముందే రావడంతో దుక్కులు కూడా పూర్తయినయ్. పంట వేసే ముందు జీలుగ వేద్దామంటే పీఏసీఎస్‌లో విత్తనాలు రాలేవంటున్నరు. అదును దాటిపోయిన తర్వాత జీలుగ విత్తనాలు వచ్చినా ఎవరికీ ఉపయోగం ఉండదు. వరి, సోయా విత్తనాలు కూడా లేవంటున్నరు. ఆయా పంటలను సాగు చేయాలంటే అడుగు మందుగా డీఏపీని చల్లాల్సి ఉంటుంది. అది కూడా రాలేదంటున్నరు. వానకాలం సీజన్ ప్రారంభమైనా నేటికీ సొసైటీల్లో ఎరువులు, విత్తనాలు ఏవీ అందుబాటులో లేవు. ఈసారి వానలు తొందరగా వచ్చాయని రైతులంతా సంతోషంగ ఉన్నరు. ఈ ప్రభుత్వం అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందించలేక పోతున్నది.
– సోమ చిన్నయ్య, రైతు, ఆలూర్, సారంగాపూర్ మండలం.
నాకున్న ఆరెకరాల్లో మక్క, వరి, పసుపు, సోయా పంటలను వేసేందుకు భూమిని దుక్కి దున్ని చదును చేసి పెట్టిన. విత్తనాలు, ఎరువుల కోసం చిట్యాల్లోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లా. ఎనిమిది బస్తాలు డీఏపీ కావాలని అడిగితే స్టాకు లేదన్నరు. 20-20 ఎరువులు ఉన్నాయని, వీటితో సరిపెట్టుకొమ్మని చెబుతున్నరు. ఏ పంట వేసినా అడుగు మందుగా డీఏపీ వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. వరి విత్తనాలు కూడా రెండు, మూడు రోజుల్లో వస్తాయని అంటున్నరు. పచ్చిరొట్ట విత్తనాలు ఎక్కడ కూడా దొరుకుతలేవు. రైతుల కోసం ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కేంద్రాల్లో కూడా ఇంకా ఎరువులు, విత్తనాలు రాలేదు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఏనాడూ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబంధు కూడా ఇస్తలేరు. పంట పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినయ్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు అన్నీ కష్టాలే ఉన్నయ్.
– రొడ్డ ప్రభాకర్, రైతు, ముజ్గి, నిర్మల్ మండలం
వానకాలం సీజన్‌కు సంబంధించి ఏ మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాం. ప్రస్తుతం సాగుకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పచ్చిరొట్ట విత్తనాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయి. త్వరలోనే సొసైటీల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటాం. యూరియా, డీఏపీ కొంతమేర కొరత ఉన్నది. రెండో విడుత డీఏపీ రావాల్సి ఉన్నది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, నిర్మల్.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండడంతో లబ్ధిదారులు దుకాణాల వద్ద బారులుదీరుతున్నారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి ఆరు సార్లు వేలిముద్రలు తీసుకోవడంతో 15-30 నిమిషాల సమయం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. సర్వర్ అప్డేట్ కాకపోవడంతో వేలిముద్రలు తీసుకునే మిషన్లు మొరాయిస్తుండడంతో అవస్థలకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయుడువాడ, ఆదర్శనగర్, పలు రేషన్ దుకాణాల వద్ద ఇదే పరిస్థితి నెలకున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, నిర్మల్.