ఖానాపూర్, మే 8 : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికే గోస పడుతున్న రైతులకు కొనుగోలు కేంద్రాల్లో సెంటర్ నిర్వాహకులు, రైస్ మిల్లర్ల తీరుతో ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం తూకంలో అడ్డగోలు కోతలు పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తేమ, తాలు, తప్ప పేరిట 40 కిలోల బస్తాకు 3 కిలోల చొప్పున కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఒక బస్తాకు 40 కిలోలు తూకం వేయాల్సి ఉండగా ఖానాపూర్ పీఏసీఎస్ నిర్వాహకులు, మిల్లర్లతో కుమ్మకై ఒక్కో బస్తాకు 43 కిలోల తూకం వేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తరుగు పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారని గురువారం రైతులు వాపోయారు.