భీంపూర్, జూలై 12 : వానకాలం కలిసిరాక అన్నదాతలు ఆగం అవుతున్నారు. కాలం ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడం లేదు. ఆరంభంలో కొంత కురిసినప్పుడు రైతులు కొందరు విత్తనాలు విత్తారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో 26 పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో దాదాపు 18 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
యేటా పత్తి, కంది, సోయా సాగు చేస్తున్నారు. ఈ యేడాది వర్షాలు కురియక పోవడంతో పంటలు వేయలేదు. కనీసం చెరువులు, పెన్‌గంగలో అయిన నీరుంటే సాగు చేస్తామనుకుంటే.. అందులో కూడా నీరు లేదు. వర్షాలు కురిస్తే మళ్లీ విత్తనాలు విత్తడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కాగా.. గతేడాది అతివృష్టితో పంటలు నష్టపోగా.. ఈ యేడాది అనావృష్టితో పంటలు వేయలేని పరిస్థితి దాపురించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటికితోడు పశువులకు గ్రాసం కూడా కరువైంది. ప్రధానంగా గుబిడి, గొల్లగడ్, తాంసి(కె), అంతర్గాం గ్రామాల రైతులు పశు రక్షణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు వరుణదేవా కరుణించు అని రైతులు వేడుకుంటున్నారు.
గతేడాది అతివృష్టితో పంటలు నష్టపోయా. ఈ వానకాలం నాకున్న పదెకరాల్లో రెండు సార్లు పత్తి విత్తనాలు విత్తిన మొలకెత్తలేదు. మూడోసారి కూడా విత్తాను. ఇలా పెట్టుబడికి ఇప్పటికే రూ.1.30లక్షలు పెట్టా. ఇప్పుడు వానలు రాక మొక్కలు ఎదగడం లేదు. మా శివారు పెన్‌గంగ నీరు లేక బోసి పోతున్నది. పశువులు, జీవాలకు గడ్డి మేతకు కరువు వచ్చేలా ఉన్నది. ఈ సర్కారు అప్పటి బీఆర్ఎస్ సర్కారులా చేయూతనివ్వాలి.
– ఎల్పుల సందీప్ యాదవ్, రైతు, పిప్పల్‌కోటి, భీంపూర్ మండలం