కోటపల్లి, మే 6 : వడ్లు కొనడంలో ప్రభుత్వ జాప్యంతోనే రైతులకు నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ విమర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన వడవ్లను విద్యాసాగర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని, రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవాల్సిన మంత్రి పట్టణానికే పరిమితమయ్యాడని విమర్శించారు.
వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడితే సమస్యలు తెలియవని, కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతులతో మాట్లాడితే వారి సమస్యలు తెలుస్తాయని మంత్రికి సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కోటపల్లి మండల రైతులతో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారుపల్లి సర్పంచ్ తొగురు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల నాయకులు కొట్టె నారాయణ, గోనె సత్యనారాయణ, పూరెళ్ళ సతీశ్, మహేశ్, దుర్గం కృష్ణదాస్, ఆసంపల్లి సంపత్, నూతన్, గుగ్లోత్ బాపు నాయక్ తదితరులు పాల్గొన్నారు.