కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ వివిధ గ్రామాలకు చెందిన సాగు రైతులు సోమవారం ఆందోళన ( Farmers Protests ) నిర్వహించారు. కుభీర్–భైంసా ప్రధాన రహదారిపై విద్యుత్ సబ్స్టేషన్ ( Sub Station ) ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించి, ధర్నాకు దిగారు.
వ్యవసాయ పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆరోపించారు. రోజులో గంటల తరబడి విద్యుత్ కోతలు విధించడంతో కనీసం మూడు నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
విద్యుత్ శాఖ ఏడీఏ వ్యవసాయ రంగానికి రోజుకు 15 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో, ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంపల్కర్ నాగేష్, రైతు నాయకులు పాల్గొన్నారు.