భైంసా/తానూర్, మే 7 : నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం టోల్‌ప్లాజా వద్ద 61వ జాతీయ రహదారిపై గురువారం మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం, తూకం వేసి న వడ్లు తరలించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ శశిభూషణ్ ధర్నా వద్దకు వచ్చి త్వరలో మక్క కొనుగోళ్లు చేపట్టేలా చూస్తామని హమీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

అలాగే తానూర్, బెల్తరోడ మొక్కజొన్న కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, ట్రాన్స్‌పోర్టు లారీల సమస్యల వల్ల కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో గురువారం కురిసిన వర్షానికి తడవడంతో ఆగ్రహించిన రైతులు భైంసా రహదారిపై ధర్నాకు దిగారు. తహసీల్దార్ మహేందర్నాథ్ ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తహసీల్దార్ మార్క్‌ఫెడ్ డీఎంతో మాట్లాడి గన్నీ బ్యాగులు, లారీలు వచ్చేలా చూడాలని, కొనుగోలు చేయాలని చెప్పడంతో రైతులు శాంతించారు.