రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో గురువారం రైతులు యూరియా ( Urea ) కోసం అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో (Farmers protest ) నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి బుధవారం రెండు లారీల యూరియా లోడ్ రాగా రైతులు యూరియా కోసం అక్కడికి పెద్ద ఎత్తున చేరుచేరుకోవడంతో ఘర్షణ జరిగింది.
అధికారులు అక్కడికి వచ్చిన రైతులకు టోకెన్లు అందించి ఒక లారీ లోడ్ యూరియాను పంపిణి చేశారు. చీకటి పడడంతో హమాలీలు వెళ్లిపోగా యూరియా పంపిణీ నిలిపివేశారు. రైతులందరికీ యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేయడంతో గురువారం పంపిణీ చేస్తామని టోకెన్లు ఇచ్చి పంపించారు.
గురువారం ఉదయం 11 గంటల వరకు పీఏసీసీఎస్ కార్యాలయం తెరుచుకోక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రెబ్బన ఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి యూరియా బస్తాలు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవడంతో రాస్తారోకో విరమించారు. అయితే యూరియా బస్తాలు పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంతో రైతులు నిరాశగా వెళ్లిపోయారు.