ఆదిలాబాద్ : పత్తి అమ్మిన డబ్బులు చెల్లించకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ పంజాబ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకులో(SBI bank) రైతులు నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడకు చెందిన నల్ల విలాస్, తంతోలీకి చెందిన జగదీష్ తో పాటు భీంపూర్ మండలం మోహన్ అనే రైతులు గతేడాది సీసీఐకి పత్తిని విక్రయించారు. ముగ్గురు రైతులకు సంబంధించిన రూ.3.76 లక్షలు ఆదిలాబాద్ ప్రధాన పోస్ట్ ఆఫీస్లో జమ అయ్యాయి. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అక్రమాల కారణంగా డబ్బుల పంపిణీ నిలిచిపోయింది.
అనంతరం విచారణ జరిపిన అధికారులు రైతులకు సంబంధించిన డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కాగా, తమ డబ్బులను ఇవ్వాలంటూ రైతులు ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించలేదు. దీంతో రైతులు బ్యాంకులోనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల జోక్యంతో బ్యాంకు అధికారులు, ఎస్బీఐ ఉన్నత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరానికి చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ కేసు వల్ల ముగ్గురు రైతులకు సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.