ఆదిలాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ) : జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మా రింది. ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. తాంసి మండలంలోని మత్తడి వాగు పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.57 టీఎంసీలు కాగా.. వానకాలంలో కురిసిన వర్షాలతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఆదిలాబాద్ రూరల్, తాంసి, భీంపూర్ మండలాల పరిధిలోని 8,500 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతున్నది. వానకాలం పంటలకు నీటి సరఫరా జరిగింది. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు యాసంగిలో జొన్న, శనగ, కూరగాయల పంటలను వేశారు.
మత్తడివాగు ప్రాజెక్టులో నీరు బాగా తగ్గింది. ఎండల ప్రభావంతో నీటిమట్టం తగ్గిపోగా, అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు సరఫరా కావడం లేదు. కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పొలాలకు నీరుపారడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు కోరినా ఫలితం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగా తాము నష్టపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రాజెక్టులో ఉన్న నీటితో తమ పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నేను ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకుని జొన్న వేశా. ఇందుకోసం రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది. సబ్ కెనాల ద్వారా పైపులు వేసి పంటకు నీరు ఇస్తామను కుంటే కాలువ పారడం లేదు. దీంతో జొన్న పంట పెరగక ఎండిపోయే ప్రమాదం నెలకున్నది. నాతోపాటు ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు నీరు అందక నష్టపోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి కాలువ ద్వారా నీటిని సరఫరా చేస్తే కొంత పంట అయినా చేతికొచ్చే అవకాశాలున్నాయి.
వేసవి రాకముందే భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. బోరు బావుల్లో నీరు తగ్గి పంటలు ఎండిపోతున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలో దాదాపుగా ఈ సీజన్లో వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న వేసినట్లు రైతులు తెలిపారు. చెరువులు, కుంటల్లో నీరు అడుగంటిపోయింది. రోజు రోజుకు భూగర్భ జలాలు తగ్గడంతో సాగు చేసిన వరి ఎండుతోంది. నీరు తగ్గడంతో మండలంలోని తురాటి గ్రామంలో వరి పంట ఎండిపోతుంది. అప్పుడే బీటలువారాయి. మరో పది రోజుల్లో పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకున్నది.
– నర్సాపూర్ (జీ), మార్చి 26