ఇచ్చోడ, సెప్టెంబర్ 14 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో రైతులు కడుపుమండి రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారు యూరియాను అందించడంలో విఫలమైందని ఆదివారం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట నుంచి అర గంటపాటు నిరసన తెలిపారు. ఇరువైపులా వాహనాలు నిలిచాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఆందోళన విరమించి బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాట్లాడారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో సర్కారు విఫలమైందని మండిపడ్డారు.
రైతురాజ్యం కాదు.. కాంగ్రెస్ దగా రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రీపగలు తిండి, నిద్ర మానేసి పడిగాపులు కాస్తున్నామన్నారు. యూరియా సరఫరా చేసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ బీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, సిరికొండ మాజీ సర్పంచ్ పెంటన్న, బీఆర్ఎస్ నాయకులు రోహిదాస్, లతీఫ్, బియ్యాల మల్లేశ్, రాజు, నర్సయ్య, ఏక్బాల్, సుభాష్, రమేశ్, పాండు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆదివారం బారులుదీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు యూరియా బస్తాలతోపాటు ఒక నానో యూరియా బాటిల్ బలవంతంగా అంటగడుతున్నారని మండిపడ్డారు. ముందే యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే.. నానో యూరియా అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నానో యూరియా పేరిట సతాయిస్తుందన్నారు. మండలంలోని మాన్కుగూడ, దేవుల్ నాయక్ తాండ గ్రామాల రైతులు తరలివచ్చి యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. సహకార సంఘం వద్ద కానిస్టేబుల్ రైతులను ఒక్కొక్కరిగా లోనికి పంపించారు. ఈ కార్యక్రమంలో ముక్రా (బీ) మాజీ సర్పంచ్ మారుతి, రైతులు అశోక్, ప్రహ్లాద్, దీపక్, వెంకటి, కైలాష్ పాల్గొన్నారు.
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తి, మక్క వేశా. అధికారులు యూరియా బస్తాలు, ఒక నానో యూరియా బాటిల్ ఇస్తున్నరు. దీంతో నానో యూరియాను పిచికారీ చేయడానికి కూలీలు అవసరం. ఇది అదనపు ఖర్చు. ఆర్థికంగా నష్టపోతాం. నానో యూరియా కాకుండా యూరియా బస్తాలు ఇవ్వాలి.
– స్రవంతిబాయి, ముక్రా(బీ), ఇచ్చోడ మండలం
నాకు ఎనిమిదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పత్తి, మక్క వేశా. వారం రోజుల క్రితం సిరికొండ పీఏసీఎస్‌లో అధికారులకు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు ఇచ్చా. ఇయ్యాల, రేపు అంటూ అధికారులు చెబుతున్నారు తప్పా.. యూరియా ఇవ్వడం లేదు. నాతోపాటు చాలా మంది రైతులు ఎరువుల కోసం ఎదురు చూస్తున్నరు. సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ఆందోళన చేశాం. యూరియా ఇచ్చి పంటలను కాపాడాలి.
– బి.లస్మన్న, సాత్మురి, సిరికొండ మండలం