నిర్మల్, మే 20(నమస్తే తెలంగాణ) : ధాన్యాన్ని అమ్ముకొనేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నరు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోపాటు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతున్నది. 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో 30 శాతానికి మించి కొనుగోళ్లు జరగలేదు. కొన్ని చోట్ల పేరుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా.. నేటికీ ఒక్క బస్తా కూడా కోనుగోలు చేయలేదు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 1,17,085 ఎకరాల్లో వరి సాగవగా.. 1.83 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు 295 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. ఇప్పటివరకు 205 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. మిగతా సెంటర్లను ప్రారంభించినప్పటికీ హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లు జరపడం లేదు. ధాన్యం సేకరణ లక్ష్యం 1.83 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు 47,136 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇంకా.. 1,35,864 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. జిల్లా వ్యాప్తంగా కోనుగోళ్లను ప్రారంభించి దాదాపు 20 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు కేవలం 30 శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.112 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.42 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంటే ఇంకా రూ.70 కోట్ల వరకు రైతులకు చెల్లించాలి.
పేరుకుపోయిన వడ్ల కుప్పలు
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఎటు చూసినా వడ్ల కుప్పలే దర్శనమిస్తున్నాయి. కొనుగోలు సెంటర్ల వద్ద రైతులు వడ్లను తీసుకొచ్చి కుప్పలుగా పోశారు. ఒకవైపు ఉరుములు మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతో రైతులు వడ్ల కుప్పలపై టార్ఫాలిన్లను కప్పి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజులుగా ఇక్కడి సెంటర్కు వడ్లను తీసుకొచ్చామని, ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని నిర్మల్ మండలం ముజ్గి గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఎప్పుడు కొంటారోనని ఎదురుచూస్తూ రోజుల తరబడి వడ్ల కుప్పల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల ముప్పుతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లు చేపట్టలేకపోతున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కనీసం గన్నీ బ్యాగులైనా ఇస్తే తామే వడ్లను నింపుకుంటామని రైతులు మొర పెట్టుకున్నా.. కొన్నిచోట్ల కేంద్రాల నిర్వాహకులు బ్యాగులు ఇవ్వడం లేదు. మరోవైపు వడ్లను తరలించేందుకు లారీల కొరత ఉన్న కారణంగా కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు తీసుకొనేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇలా అనేక రకాల కొర్రీలతో కొనుగోలు ప్రక్రియ మందకోడిగా సాగుతున్నది. గత కేసీఆర్ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు మండిపడుతున్నారు.
నిర్మల్ జిల్లాలో..
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం : 1.83 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసింది : 47,136 మెట్రిక్ టన్నులు
కొనాల్సింది : 1,35,864 మెట్రిక్ టన్నులు