మంచిర్యాల, జూలై 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి):మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు.. కటిక చీకట్ల పాలన అందించిన కాంగ్రెస్‌ను బొందపెట్టాలి.. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే కావాలి.. మూడు గంటలే కరెంటు చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులోకానికి క్షమాపణ చెప్పాలి.” అని రైతు వేదికల సాక్షిగా కర్షకలోకం గర్జించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు సోమవారం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రైతు సభలు నిర్వహించారు. ఈ సమావేశాలకు వేలాది మంది రైతులు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డి కుట్రలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గంట ల కరెంట్ ఇస్తామని మూడు గంటలు కూడా ఇయ్యలేదని, ఎప్పుడూ కరెంట్ కోసం పడిగాపులు కాసేటోళ్లమని, అర్ధరాత్రి వచ్చే కరెంట్‌తో నీళ్లు పెట్టేందుకు పోయి కరెంట్ షాక్‌తో, పురుగూపుట్రా కుట్టి చనిపోయిన రైతుల చావులకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. ఆ దరిద్రపు రోజులు మళ్లీ రావొద్దంటూ తీర్మానాలు చేశారు. కాగా.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్లో ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ మండలం సిర్సన్న, డొల్లారా, మావల రైతువేదికల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు.
మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు..’ అని రైతులు ముక్తకంఠంతో గర్జించారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తుంటే.. చూసి ఓర్వలేక ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. రైతులపై రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. స్వరాష్ట్రంలో బాగుపడుతున్న రైతుల కడుపుకొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతు వేదికల్లో సోమవారం రైతు సభలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన అన్నదాతలు సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఆరు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ మూడు గంటలు కూడా ఇయ్యలేదని, ఎప్పుడో దొంగోలే వచ్చే కరెంట్ కోసం పడిగాపులు కాసేటోళ్లమని, అర్ధరాత్రి వచ్చే కరెంట్‌తో నీళ్లు పెట్టేందుకు పోయి కరెంట్ షాక్‌తోనో.. పురుగూపుట్రా కుట్టో చనిపోయిన రైతుల చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ పాత పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
ఆ దరిద్రపు రోజులు మళ్లీ రావొద్దంటూ నినదించారు. “కాంగ్రెస్ కటిక చీకట్ల కాలం వద్దు.. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే ముద్దు.. మూడు గంటల వ్యవహారం వద్దు.. మూడు పంటల విధానం కావాలి” అని తీర్మానాలు చేసి వాటిని మండల రైతు సమాఖ్యల కు పంపించారు. మంత్రి కేటీఆర్ పిలుపుతో మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం ముత్యంపేట, లక్షెట్టిపేట మం డలం దౌడేపల్లి, సూరారం రైతువేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో ఈజ్గాం విలేజ్ నంబర్-5లోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఖానాపూర్ మండలం దిలావర్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ మండలం సిర్సన్న, డొల్లారా, మావల రైతువేదికల్లో నిర్వహించిన రైతు సభల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. చెన్నూర్ నియోజకవర్గం సిర్సా రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రైతులు, స్థానిక నాయకులు తీర్మానాలు చేశారు.
రైతుల ఓట్లు అడిగే హక్కు లేదు..
ఆదిలాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని మమ్ముల కించపర్చే విధంగా మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో రైతులు మస్తు ఇబ్బందులు పడ్డరు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. పంటలు కొనేటోళ్లు లేరు. కరెంటు లేక వర్షాలపై ఆధారపడి పంటలు పండించేటోళ్లం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన్రు. 24 గంటల కరెంటుతో రైతులు రెండు పంటలు సాగు చేస్తూ సంతోషంగా ఉన్నరు. రైతులను ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నరు. వారికి రైతుల ఓట్లు అడిగే హక్కు లేదు.
– గంగన్న, రైతు, బట్టిసావర్గాం, మావల మండలం
కాంగ్రెస్‌ను నమ్మం..
జైనథ్, జూలై 17 : తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక మంచి పనులు చేస్తున్నడు. ఈ రోజు రైతులందరూ సంతోషంగా ఉన్నరంటే అది ఆయన పుణ్యమే. 24 గంటల ఉచిత విద్యుత్‌తో మూడు పంటలు కూడా తీస్తున్నం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరిగోస పడ్డం. ఒకే ఒక్క పంట తీసేటోళ్లం. కరెంట్ ఉంటే నీళ్లుండేటివి కావు.. నీళ్లుంటే కరెంట్ ఉండేది కాదు. కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మం. సీఎం కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దొరకడు. ఆయన ఉన్నంత కాలం రైతులకు ఢోకా లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నడు. వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఊర్లళ్లకు రానియ్యం.
– కాటిపెల్లి కిష్టారెడ్డి, రైతు, పిప్పర్వాడ, జైనథ్ మండలం
మూడు గంటల కరెంటన్న పార్టీని తరిమికొడుతం..
దండేపల్లి, జూలై 17 : సర్కారు ఇస్తున్న పంట పెట్టుబడి సాయం మర్చిపోలేనిది. ఇది వరకు పంటలు వేయాలంటే పెట్టుబడికి సావుకార్ల దగ్గరికి పోయేటోళ్లం. అష్టకష్టాలు పడి పంట పండించిన తర్వాత వడ్డీతో కలిసి చెల్లించేటోళ్లం. అన్నీ పోంగ ఏం మిగిలేటివి కావు. కొందరైతే ఎవుసం వదిలేసి పట్టణాలకు కూలీ పనులకు పోయిన్రు. కానీ తెలంగాణ వచ్చి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక రైతుల బాధలన్నీ పోయినయ్. ఉచితంగా 24 గంటల కరెంటిత్తన్రు. పెట్టుబడికి సాయమందిస్తున్నరు. ఎరువులు, విత్తనాలు కొరత లేకుంట చేసిన్రు. అసలు రైతులకు తిప్పలు లేకుంట చేసిన సర్కారు ఏదైనా ఉందంటే అది కేసీఆర్ సర్కారే. గింత మంచి పనులు చేసిన సీఎం సారును ఎట్లా మర్చిపోతం. గుండెల్లో పెట్టుకొని చూస్కుంటం. మూడు గంటల కరెంటన్నోళ్ల పార్టీ పల్లెల్లోకి వస్తే తరిమికొడుతం. -కట్ల మల్లేశ్, రైతు, చింతపెల్లి
ఇసొంటి పథకాలు ఎక్కడా లేవు…
జైనథ్, జూలై 17 : తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేక కాంగ్రెసోళ్లు ఏం మాట్లాడు తున్నారో అర్థం కావుడం లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 3 గంటలే కరెంటు చాలు అని మాట్లాడుతున్నడు. రైతుల బాధలు తెలిస్తే అట్లా అనడు.. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఏ గ్రామంలో ఏ రైతును అడిగినా ఉచిత కరెంటు గురించి గొప్పగా చెప్తారు. దేశంకు అన్నంపెట్టే రైతును రాజును చేస్తున్నది సీఎం కేసీఆరే. కాంగ్రెసోళ్లు రైతులను ఓట్లు అడిగే అర్హత కోల్పోయిన్రు. వారు గ్రామాలకు వస్తే నిలదీస్తం.
– గౌరి సంజీవ్ , రైతు ,పిప్పర్వాడ ,జైనథ్ మండలం
కరెంట్ కష్టాలు తీరినై..
లక్షెట్టిపేట రూరల్, జూలై 17 : అప్పట్లో కరెంట్ ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలియని దుస్థితి. పొలాలు పారక పంటలు ఎండి అప్పుల పాలైనం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రైతుల బాధలు తీరినై. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించి మమ్మల్ని ఆదుకుంటున్నడు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వాళ్లు ఉచిత విద్యుత్ వద్దు వ్యవసాయనికి మూడు గంటలే చాలు అనడం బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే కరెంట్ వల్ల రంది లేకుండా సాగు చేసుకుంటున్నం. రేవంత్‌రెడ్డి మాటలు నిజంగా బాధాకరం. రైతుల ఇబ్బందులు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కాబట్టే ఆయనకు మద్దతుగా ఉంటం.
– చిందం రాజన్న, రైతు, దౌడపల్లి(లక్షెట్టిపేట మండలం)
కాంగ్రెస్ పాలనలో మోటర్లు పన్జేసిటివి కావు
మా ఊరిలో నాకు ఐదెకరాల భూమి ఉంది. యేటా వానకాలంలో పత్తి, కంది పండిస్తా. యాసంగిలో శనగ, పల్లి, జొన్న వేస్తా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం చేయాలంటేనే భయపడేటోళ్లం. విత్తనాలు, ఎరువులు దొరికేవి కావు. కరెంటు మూడు, నాలుగు గంటలే ఇచ్చేటోళ్లు. లో వోల్టేజీ కరెంట్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. మోటర్ల పన్జేసిటివి కావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తుంది. దీంతో రైతులకు మంచి సౌలత్ అయింది. కాంగ్రెస్ పాలనలో నేను ఒకటే పంట వేసేది. ఇప్పడు 24 గంటల కరెంటుతో యాసంగిలో పల్లి, శనగ, జొన్న పంటలు సాగు చేస్తున్నా. అన్ని ఖర్చులో పోను రూ.1.50 లక్షల దాకా ఆదాయం వస్తుంది. – మర్సకోల రమేశ్, రైతు, వాఘాపూర్, మావల మండలం
మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ వద్దు..
నా పేరు చింతల మల్లేశ్. మాది ఖానాపూర్ మండలం దిలావర్పూర్. 25 ఏండ్ల సంది ఎవుసం చేస్తున్న. మా ఊరి శివా రులో పదెకరాలు కౌలుకు తీసుకొ ని వరి సాగు చేస్తున్న. కాంగ్రెస్ పాలనలో పంటలు పండించాలంటే రైతులమంతా భయపడే టోళ్లం. కరెంట్ ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెల్వక పోయేది. ఇచ్చిన ఆ పాటి కరెంట్ కూడా సక్కగా ఇచ్చేటోళ్లు కాదు. రాత్రింబవళ్లు పొలాల కాడ పడుకొని పారించుకునేటోళ్లం. మస్తు నష్టం వచ్చేది. ఇైట్లెతే బతుకుడు కష్టమని 8 ఏండ్లు గల్ఫ్ దేశాలకు పోయి వచ్చిన. తెలంగాణ వచ్చినంక రైతుల బతుకులు బాగుపడ్డయ్. అందుకే ఇక్కడికి తిరిగొచ్చి మళ్లా ఎవుసం చేస్తున్న. 24 గంటల పాటు కరెంటిస్తన్రు. రంది లేకుంట ఎవుసం చేస్తున్నం. మళ్లా కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంటిస్తమని చెబుతన్రు. గసొంటి ప్రభుత్వం మాకొద్దు.