ఆదిలాబాద్, మే 10(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 353(బీ) నిర్మాణ పనులు రైతుల పాలిట శాపంగా మారాయి. మహారాష్ట్ర సరిహద్దు ఉపసనాల నుంచి భోరజ్ జాతీయ రహదారి-44ను కలిపేలా పనులు జరుగుతున్నాయి. బేల, జైనథ్ మండలాల మీదుగా 33 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నా యి. ఆరు నెలల కిందట ప్రారంభమైన పనులు 2026 మే లోగా పూ ర్తి కావాలి. ప్రస్తుతం ఉన్న 7 మీటర్ల రో డ్డును 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ(నేషనల్ హైవే) విభాగం అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. రెండు వరుసల రోడ్డు వెడల్పులో భాగంగా వంతెనలు, వర్షం నీరు పోవడానికి రహదారికి ఇరువైపులా కాలువలు నిర్మిస్తున్నారు.
రైతుల భూములకు ఆనుకుని డ్రెయిన్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. దాదాపు మీటరు వెడల్పుతో నిర్మిస్తున్న కాలువల కారణంగా రైతులు తమ భూముల్లోకి పోవడానికి దారి లేకుండా పోతున్నది. వ్యవసాయ పనులు చేసుకోవాలంటే రైతులు వెడల్పుగా ఉన్న డ్రెయిన్లు దాటాలి. జిల్లాలో వానకాలం సీజన్‌కు రైతులు సన్నద్ధమవుతున్నారు. భూములను దున్నుతూ పంటలు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. భూమి దున్నడానికి ట్రాక్టర్లతోపాటు ఎడ్లబండ్లు వెళ్లాలంటే కష్టంగా ఉంటుంది.
పురుషులతోపాటు మహిళా రైతులకు కూడా కాలువలు దాటరాకుండా ఉంది. దాటే ప్రయత్నం చేస్తే పడిపోతే కా లు, చేయి విరగడంతోపాటు దెబ్బలు తాకి మంచాన పడుతామని రై తులు ఆవేదన చెందుతున్నారు. డ్రెయిన్ నిర్మించిన చోట ర్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో తమ పొలాలకు ఎలా వెళ్లాలి? వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలో? తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ పొలాలకు వెళ్లేలా దారి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
రహదారి నిర్మాణంలో భాగంగా నీళ్లు పోవడానికి డ్రెయిన్లు నిర్మిస్తున్నాం. రహదారి నిర్మాణ డిజైన్‌లో డ్రెయిన్లపై ర్యాంప్స్ నిర్మించాలని లేదు. ఎవరైన రైతులు తమ పొలాలకు పోవడానికి దారి కావాలని అడిగితే ర్యాంపులు నిర్మిస్తున్నాం. అవసరమున్న రైతులు అడిగితే వారు తమ పొలాల్లోకి వెళ్లేలా ర్యాంపులు ఏర్పాటు చేస్తాం.
– సుభాష్, డీఈ, రోడ్లు భవనాల శాఖ.