కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తేమ పేరిట జిన్నింగ్ మిల్లులో సేకరణ నిరాకరించడంతో కర్షకులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. తేమ శాతం 12కు మించి ఉందని తేల్చిన అధికారులు, కొనుగోళ్లకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు స్థానిక జాతీయ రహదారిపైకి చేరుకొని గంటకు పైగా రాస్తారోకో చేశారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని కోరారు. అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకూ వెనక్కి తగ్గేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం పెరిగిందని, 15 నుంచి 20 శాతం తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక పోలీసులు.. రైతులను బలవంతంగా లేపే ప్రయత్నం చేయగా, వాగ్వాదం చోటు చేసుకున్నది. ఒక దశలో వాంకిడి ఎస్ఐ మహేందర్‌కు.. రైతులకు మధ్య తోపులాట జరగగా, ఉద్రిక్తతతకు దారితీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రైతులను సముదాయించి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

వాంకిడిలోని జీవీపీ జిన్నింగ్ మిల్లులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. తేమ 12 శాతానికంటే ఎక్కువగా ఉందని.. అధికారులు కొనుగోళ్లకు నిరాకరించడంతో రైతులు రోడ్డెక్కారు. దీంతో గంటకు పైగా పత్తి కొనుగోళ్లు సాగలేదు. కాగా, యేటా అధికారులు-జిన్నింగ్ మిల్లుల యజమానులు మిలాఖత్ అయి రైతులను నిలువుదోపిడీ చేయడం సర్వసాధరణమైంది. పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుపాన్ కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి.
చేలల్లో ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి సైతం రాలిపోయింది. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి, 4 నుంచి 5 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పత్తినైనా అమ్ముకొని అప్పులు తీర్చుకుందామంటే అధికారులు ఆదిలోనే కొర్రీలు పెడుతున్నారంటూ వారు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలంటూ వారు కోరుతున్నారు.