జైపూర్ సమీపంలోని సుందిళ్ల బ్యారేజ్ నీరు లేక వెలవెల బోతుండగా, భూగర్భ జలాలు అడుగంటి వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. అటు బోర్లలో నీళ్లు లేక.. ఇటు కరెంట్ సరిగా సరఫరా కాక పొట్టదశలో ఉన్న వరి చేతికందకుండా పోయే దుస్థితి నెలకొన్నది.
మంచిర్యాల, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి నదిపై ఏర్పాటు చేసిన సుందిళ్ల బ్యారేజ్‌లో నీరు లేకపోవడంతో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వందలాది ఎకరాల పంటలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. సుందిళ్ల బ్యారేజ్‌లో నీరుంటే జైపూర్ మండలం మొదలుకొని.. మంచిర్యాల జిల్లా కేంద్రం వరకూ గోదావరిలో బ్యాక్ వాటర్ స్టోర్ ఉండేది. ఎప్పుడు చూసినా గోదావరి నిండు కుండలా కనిపించేది. కానీ, మేడిగడ్డ పిల్లర్‌ను సాకుగా చూపించి జైపూర్ సమీపంలోని సుందిళ్ల బ్యారేజ్, చెన్నూర్ సమీపంలోని అన్నారం బ్యారేజ్‌లలో నీరు ఆపకుండా.. వచ్చిన వరదను వచ్చినట్లు కిందకు వదిలేశారు. దీంతో గోదావరి ఎడారిగా మారిపోయింది. ఈ దెబ్బతో జైపూర్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. దీంతో చెరువులు, బోర్లపై ఆధారపడి సాగు చేసిన వరి పంటకు పొట్టదశలో నీరు అందడం లేదు. పొద్దంతా బోరు నడిపించినా నీరందని దుస్థితి నెలకొంది.
ఈ యాసంగిలో జైపూర్ మండలంలో దాదాపు 11 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. బోర్ల కిందే ఇవన్నీ సాగవుతున్నాయి. ప్రస్తుతం మండలంలో భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో వందల ఎకరాల్లో వరి ఎండిపోయే దుస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఇదే సమయానికి (ఫిబ్రవరి 2023)లో జైపూర్ మండలం కుందారం గ్రామంలో 15.89 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండే. గతేడాది, ఈ ఏడాది గోదావరిలో నీరు లేక నీటిమట్టం ఘోరంగా పడిపోయింది.
గతేడాది 18.60 మీటర్లకు, ఈ ఏడాది 18.19 మీటర్ల లోతులో జలాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జైపూర్ మండల కేంద్రంతో పాటు గోదావరి పక్కనే ఉండే ఇందారం, టేకుమట్ల, రామారావుపేట, వేలాల గ్రామాల్లోనూ బోర్లలో నీరు పాతాళానికి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో చేతికి రావాల్సిన వరి నీరు లేక కండ్ల ముందే ఎండిపోతుందంటూ అన్నదాతలు వాపోతున్నారు. అధికారులు స్పందించి నీరందించాలని, లేనిపక్షంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నా పేరు సంబోదు మల్లేశ్. నాకు టేకుమట్లలో చెరువుకింద రెండెకరాలు ఉన్నది. చెరువులో నీరు లేక బోరు కింద యాసంగి సాగు చేస్తున్న. కానీ ఆ బోరులోనూ నీరు అడుగంటింది. అటున్న పైపులు ఇటు పెట్టి, ఇటున్న పైపులు అటుపెట్టి.. మార్చి మార్చి పైపులు తిప్పితే మూడు రోజులకోసారి పంట మొత్తం తడుస్తుంది. మరో నెలరోజులు నీళ్లు అందితేనే పంట చేతికొస్తది. ఇప్పుడే ఎండలు ముదిరినయ్.. నీళ్లు అందుతయే లేదోనన్న భయమేస్తున్నది. పొద్దంతా బోరు నడిచినా నీరు అందుతలేదు. నీరు లేక మాటిమాటికీ మోటర్ వేసుకుంట.. ఆపుకుంటా నీరు పెడుతున్న. పొద్దున నుంచి సాయంత్రం కరెంట్ పోయే దాకా పొలం కాడనే ఉంటున్న. మధ్యమధ్యలో కరెంట్ ట్రిప్పు అవుతుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా అర్థం కావడం లేదు. ఇటు కరెంట్ సరిగా రాక.. అటు నీళ్లు లేక పంట చేతికొచ్చుడు కష్టంగనే ఉన్నది.
– సంబోదు మల్లేశ్, టేకుమట్ల, రైతు, మంచిర్యాల జిల్లా