కాగజ్‌నగర్, జనవరి 1 : కాగజ్‌నగర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నది. కొందరు ఏదో ఒక కారణం చెప్పి సెలవుపై ఉండగా.. మరికొందరు కాంట్రాక్టు ఉద్యోగులు పాలకవర్గం వేధిస్తూన్నారంటూ విధులకు రావడం లేదు. దీంతో ఆయా మండలాల నుంచి పనుల మీద వస్తున్న కౌలు రైతులకు తిప్పలు తప్పడం లేదు. పది రోజులుగా సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో రైతులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. మంగళవారం కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో సెక్రటరీ ఓదెలును ‘నమస్తే’ ఫోన్లో సంప్రదించగా సిబ్బంది సెలవు ఉన్నారని, తను కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్‌లోని కార్యాలయంలో కౌలు రైతుల వివరాలు ఆన్లైన్ చేస్తున్నానని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు నలుగురు, రెగ్యులర్ ఉద్యోగులు ఇద్దరు కూడా విధులకు హాజరు కాకపోవడంతో కార్యాలయం ఖాళీగా దర్శనమిచ్చింది.
సిబ్బందిని తొలగించే కుట్ర?
కాగజ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో విధులు నిర్వర్తించే తమను తొలగించే కుట్రలో భాగంగానే పాలకవర్గం వేధిస్తున్నదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన సెక్రటరీ భాస్కర్ పాలకవర్గానికి అనుకూలంగా లేడని బెల్లంపల్లికి బదిలీ చేయించారని, కరీంనగర్లో విధులు నిర్వర్తించే ఓదెలును కాగజ్‌నగర్‌కు రప్పించారని వారు చెబుతున్నారు. పాలకవర్గం బంధువులు, అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమను తొలగించడానికి ఇప్పటికే తీర్మానం కూడా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతమున్న మార్కెట్ కమిటీ సెక్రటరీ ఓదెలు సమయపాలన పాటించడం లేదని, దూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరుగుతున్న ఘటనలపై విచారణ జరిపి సిబ్బందికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.