తాంసి, ఏప్రిల్ 25 : అకాల వర్షాలు ఆగడం లేదు. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యింది. మంగళవారం మండలకేంద్రంతోపాటు గిరిగామ, అంబుగాం, పొన్నారి, కప్పర్ల, వడ్డా గ్రామాల్లో మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రెండు గంటల పాటు కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన గోధుమ, జొన్న, మక్కజొన్న పంటలు తడవకుండారైతులు టార్పాలిన్లు కప్పి జాగ్రత్త పడ్డారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, ఏప్రిల్ 25 : మండలంలోని పెన్‌గంగా పరీవాహక ప్రాంతాలు సహ అంతటా అకాల వర్షం కురిసింది. గుబ్‌డి, కరంజి(టీ), గోముత్రి, అంతర్గాం తదితర గ్రామాల రైతులు తమ చేలలో కోసిన జొన్న తదితర పంటలను కాపాడుకునేందుకు ఇబ్బంది పడ్డారు. చేలలో ఉన్న ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షంతో ఆదిలాబాద్- కరంజి(టీ) రూట్లో బస్సుల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది.
ఇచ్చోడ, సిరికొండలో వడగండ్లు.
ఇచ్చోడ, ఏప్రిల్ 25 : ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం ఒక్కసారిగా కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సిరికొండతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో కూడా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. పలు చోట్ల పూరి గుడిసెలు, ఇండ్లపై కప్పులు గాలికి ఎగిరిపడాయి.
గుడిహత్నూర్‌లో భారీ వర్షం
గుడిహత్నూర్,ఏప్రిల్25: గుడిహత్నూర్ మం డలంలో వడగండ్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కరెంటు తీగలు తెగిపోయాయి. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు విరిగి పడింది. రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు కాలనీలు జలమలయమయ్యాయి.
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 25: మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై వరద ప్రవహించింది. కేబీ కాంప్లెక్స్, కొమ్ముగూడలో కరెంట్ స్తంభాలు విరిగి పడ్డాయి. మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు చేపట్టారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
బోథ్ మండలంలో
బోథ్, ఏప్రిల్ 25: బోథ్ మండలంలో మోస్తా రు వర్షం కురిసింది. ఈదురుగు గాలులతో కురిసిన వర్షం పంటలకు నష్టం చేకూర్చింది. నూర్పిడి చేసి పొలాల్లో ఆరబెట్టిన మక్కల కుప్ప లు వర్షానికి తడిసిపోయాయి. కోత దశకు చేరుకున్న జొన్న, నువ్వుల పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలు తడిసి నల్లబారి పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. బోథ్, సొనాల, కౌఠ (బీ), ధన్నూర్ (బీ) తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి తోడు గాలి వీయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సుంకిడిలో పిడుగుపాటుకు ఎద్దు మృతి
తలమడుగు, ఏప్రిల్ 25 : మండల కేంద్రంతో పాటు సుంకిడి, కుచులాపూర్, బరంపూర్, అర్లి, కజ్జర్ల, లచ్చంపూర్, దేవాపూర్‌లో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వడగండ్లు కురవడంతో జొన్న, పల్లి తదితర పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికందే సమయంలో వర్షం కురవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుంకిడి గ్రామంలో అజయ్ రెడ్డి వ్యవసాయ పొలంలో పిడుగు పడగా ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఎద్దుకు గాయాలయ్యా యి. చనిపోయిన ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని మండల పశువైద్యాధికారి డాక్టర్ దూద్‌రాం తెలిపారు.
పాటగూడలో
ఇంద్రవెల్లి, ఏప్రిల్25 : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలోని వాల్గొండ, వడగాం, డోంగర్‌గాం, మారుతిగూడ, హీరాపూర్, పోల్లుగూడ, ఖైర్గూడ, లింగాపూర్, పాకిడిగూడ, మామిడిగూడతోపాటు పలు గ్రామాల్లో ఇళ్ల పై కప్పులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. వాల్గొండలో విద్యుత్ స్తంభాలతోపాటు మినీ ట్రాన్స్ ఫార్మర్లు, చెట్లు నేలకొరిగాయి. పిట్టబొంగురం పరిధిలోని పాటగూడకులో ఓ రైతుకు చెందిన ఎద్దుపై పిడుగు పడగా మృతి చెందింది. భారీ వర్షంతో మక్క, జొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
రాజురాలో మేకల కాపరి మృతి
ఖానాపూర్ రూరల్, ఏప్రిల్ 25 : ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో మేకలు కాపరిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాజురా గ్రామానికి చెందిన పాతకుంట మోహన్ (21) మేకలను తీసుకొని మేతకు వెళ్లాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. అంతలోనే పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.