మంచిర్యాల, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంది లేకుంట పంటలు సాగు చేసి, దర్జాగా బతికిన రైతాంగం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నది. వడ్లు కొనకుండా ఏదో ఒక మెలిక పెడుతూ ముప్ప తిప్పలు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నది, “హమాలీల కొరత ఉంది. తూకం వేశాక మీరే అన్లోడ్ చేసుకోవాలి. ఈ నిబంధనకు ఒప్పుకుంటేనే లారీలు వస్తాయి.” అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్పడంపై మదనపడుతున్నది. ఇక అన్లోడ్ చేయకుంటే తూకం వేయరేమోనన్న భయంతో చివరకు రైతులే హమాలీలుగా మారడం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల సమీపంలో కనిపించింది. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు అలసత్వం రైతుల పాలిట శాపంగా మారిందనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
కొనుగోలు కేంద్రాల్లో బస్తా బరువుతో కలిపి 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా, 42 కిలోల నుంచి 43 కిలోలు తూకం వేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రాల్లో బస్తా 42 కిలోలు తూకం వేస్తే, రైస్ మిల్లర్లు మరో కిలో అదనంగా.. అంటే 43 కిలోలు కోత పెడుతూ రైతులను గోస పెడుతున్నారు. క్వింటాకు ఏడున్నర కిలోలు బహిరంగంగానే దోచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం రైస్ మిల్లులో అన్లోడ్ చేయాలంటే బస్తాపై రూ.2 అదనంగా వసూలు చేస్తూ, రైతుల నుంచి వేలాది రూపాయాలు గుంజుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రైతులను ఇన్ని రకాలుగా దోచుకుంటూ.. పైపెచ్చు హమాలీల కొరత ఉందని కొనుగోలు కేంద్రాల్లోనే తూకం వేసి గోదాములకు తెచ్చిన ధాన్యాన్ని రైతులనే అన్లోడ్ చేసుకోమని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నా యి. గతంలో ఇదే సమయానికి దాదాపు 70 శాతం నుంచి 80 శాతం కొనుగోళ్లు పూర్తికాగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని ఆ పరిస్థితి కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లాలో 2.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ కేవలం 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 334 కొనుగోలు కేంద్రాలు ఉంటే, ఇప్పటి వరకూ 328 మంది రైతు ల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ లెక్కన కేంద్రానికి ఒక్క రైతు చొప్పున ధాన్యం సైతం కొనలేక పోయినట్లు తేటతెల్లమవుతున్నది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, జిల్లాలో సరిపడా మిల్లుల్లకు ట్యాగింగ్ ఇవ్వకపోవడం, రా రైస్ మాత్రమే పెట్టాలని చెబుతుండడం కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయి. అన్నింటినీ మించి మిల్లర్ల సమస్య ఎక్కువైపోవడంతో ధాన్యం దించుకోవడంపై మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతో కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి. కల్లాలకు ధాన్యం తీసుకువచ్చి పోసి నెల కావస్తున్నా తూకం వేయడం లేదు. ముందస్తు కొనుగోళ్లు లేకపోవడంతో హమాలీలు సైతం దొరకడం లేదు. ఎండల తీవ్రత పెరగడంతో ఎవరూ పనుల్లోకి రావడం లేదు. దీంతో సమస్య తీవ్రమైపోయింది.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో కన్నెపల్లి, లింగాల, చింతపూడి, నాయకంపేట, మెట్టుపల్లి, జన్కాపూర్, మాదవెల్లి కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు లేరని రైతులకు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడా మా హమాలీలతో తూకం వేయిస్తాం, కానీ గోదాములకు వెళ్లి మీరే అన్లోడ్ చేసుకోవాలని రైతులకు చెప్పడం గమనార్హం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ఇందుకు అంగీకరిస్తున్నారు. అలా కన్నెపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తూకం వేసిన తమ ధాన్యాన్ని తాండూరు రేచినిలోని వ్యవసాయ గోదాములో నిల్వ చేస్తున్నారు. దీంతో ధాన్యం తూకమైన వెంటనే.. ఆ రైతులు గోదాములకు వచ్చి తమ బస్తాలను తామే దించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
మాది కన్నెపల్లి. నాకున్న ఐదు ఎకరాలకు 325 బ్యాగులు ధాన్యం తూకం వేశారు. హమాలీలు లేరు. గోదాములో మీరు వడ్లు దించుకుంటేనే లారీ పెడుతాం.. లేకపోతే లేదని నిర్వాహకులు చెప్పారు. వర్షాలకు వడ్లు తడువవట్టె. రోజూ పరదాలు కప్పుడు, తీసుడు అయితంది. ఇగ తప్పదని లోడ్ దించేందుకు ఒప్పుకున్నం. ఏప్రిల్ 24న మావద్ద సెంటర్ ఓపెన్ చేశారు. తూకం ఆలస్యం చేశారు. తూకం వేశాక ఈ రోజు బండి వస్తది, రేపు బండి వస్తది అని చెప్పుకుంట వచ్చారు. గట్టిగా అడిగితే గోదాములో దించడానికి హమాలీలు లేరు, మీరు దించుకుంటా అంటేనే బండ్లు వస్తాయన్నారు. అందుకు ఒప్పుకున్నాకే లోడ్ పెట్టారు. ఆరుగురు రైతుల బస్తాలు గోదాంకు వచ్చాయి. మేమంతా కలిసి లోడ్ దించినం.
– కోట్రంగి రంజిత్, కన్నెపల్లి
నా కున్న 30 గుంటల్లో 66 బస్తాల ధాన్యం వచ్చింది. తూకం వేసి పది రోజుల తర్వాత లారీ వచ్చింది. మేము అన్లోడ్ చేస్తామని ఒప్పుకున్నాకే దానిని పంపించి న్రు. ఇది వరకు ఇట్లా లేకుండే. హామాలీలు తూకం వేసి లారీ లోడ్ చేస్తే, గోదాంల వద్ద హమాలీలు దించుకునేటోళ్లు. ఇప్పుడు మాతోనే హమాలీ పని చేపిస్తున్నరు. అక్కడ తూకం వేసిన బస్తాలను.. ఇక్కడ కూడా తూకం వేస్తున్నరు. ఏం చేయలేక తప్పనిసరి పరిస్థితుల్లో మా బస్తాలను.. మేమే దించుకుంటున్నం.
– కోట్రంగి లక్ష్మీనారాయణ, కన్నెపల్లి
మాది చింతపూడి. నాతో పాటు 10 మంది రైతులు గోదాములకు వచ్చిన్రు. హమాలీలు లేక కొనుగోలు కేంద్రంలో మేమే లోడ్ చేసుకున్నం. ఆ లారీ గోదాముకు వచ్చాక మళ్లా అన్లోడ్ చేసినం. గతంలో హమాలీలు లేకపోతే మేమే తూకం వేసుకునేటోళ్లం. కానీ మిల్లుకు, గోదాము వద్దకు పోయేటోళ్లం కాదు. కానీ, ఈ సారి మాతోనే గోదాములో వడ్లు దింపిస్తున్నరు.
– విలాసాగరం మధునయ్య, చింతపూడి