ఆదిలాబాద్, జనవరి 30 ( నమస్తే తెలంగాణ) : సీసీఐ నిబంధనలు ప్రకారం..తేమ శాతం నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన పత్తిని తీసుకువచ్చినందుకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే గాని కొంత మందికి మాత్రమే నామమాత్రంగా అందించారని అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధన ప్రకారం..రైతులు తెచ్చిన పత్తిలో తేమ శాతం 8 ఉంటే మద్దతు ధర క్వింటాలుకు రూ.8010 చెల్లించాలి. 9 శాతం ఉంటే రూ.80 తగ్గించి రూ.7910తో 10 శాతం ఉంటే రూ.160 తగ్గించి రూ. 7850తో, 10 శాతం ఉంటే రూ.7770తో 11 శాతం తేమ ఉంటే రూ.7690తో 12 శాతం ఉంటే 7610తో కొనుగోలు చేయాలి.
8 శాతం కంటే తక్కువ తేమ 7 శాతం ఉంటే మద్దతు ధర క్వింటాకు రూ.8010 కలిపి రూ.8090తో 6 శాతం ఉంటే రూ.160 కలిపి రూ.8170తో కొనుగోలు చేయాలి. కానీ జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఈ నిబంధనల అమలు కావడం లేదు. దీనిపై గట్టిగా ప్రశ్నించిన వంద మంది రైతులకు నామ్‌కే వాస్తేగా ఇన్సెంటివ్ అందించారు. ఇన్సెంటివ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించడంతో రైతులు నష్టపోతున్నారు.
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కార్పొరేట్ సంస్థలా వ్యవహరిస్తూ రైతులను నష్టాలకు గురిచేస్తున్నది. పంట కొనుగోళ్లలో సీసీఐ మొదటి నుంచి మెలికలు పెడుతూ రైతులను ఇబ్బందులు పెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ. 8110 ప్రకటించగా పంట కొనుగోళ్ల ప్రారంభం నుంచి పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందంటూ సీసీఐ అధికారులు పంటను తీసుకోవడం లేదు. దీంతో రైతులు మార్కెట్‌యార్డులో రోజుల తరబడి పత్తిని ఎండపెట్టి తేమ శాతం తగ్గిన తర్వాత విక్రయించారు.
చాలా మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు రూ.1400 తక్కువకు విక్రయించి నష్టపోయారు. పత్తిలో పింజ పొడవు రావడం లేదంటూ సీసీఐ అధికారులు రూ.50 తగ్గించి, క్వింటాలుకు రూ.8010తో కొనుగోలు చేయనున్నారు. దీంతో రైతులకు మద్దతు ధర లభించగా క్వింటాలుకు రూ.100 నష్టపోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కార్పొరేట్ వ్యవహార శైలి ఫలితంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు. పంటల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా లోకల్ మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించినా టీంలు ఎక్కడా కనిపించడం లేదు.
జిల్లాలో పత్తి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 80 వేల మంది రైతుల వద్ద నుంచి సీసీఐ 13.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. వీరిలో చాలా మంది రైతులు పత్తిని ఎండపెట్టి తేమ 8 శాతానికి తక్కువ ఉన్న పంటను తీసుకువచ్చారు. 6 నుంచి 7 శాతం తేమ వచ్చినా సీసీఐ సిబ్బంది 8 శాతం ఆపైగా తేమ రాయడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. పది రోజుల నుంచి రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. పత్తిలో నాణ్యత లేదంటూ 12 శాతం తేమతో కొనుగోలు చేస్తున్నారు.
రైతులు సీసీఐకి విక్రయించేందుకు తీసుకువచ్చిన పత్తిలో 8 శాతానికి తక్కువ తేమ ఉంటే మద్దతు ధరలో ప్రతి పాయింట్‌కు రూ.80 కలిపి ధర చెల్లించాలి. జిల్లాలో 11 మార్కెట్‌యార్డుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నా ఏ ఒక్క చోట రైతులకు ఇన్సెంటీవ్ ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని మార్కెటింగ్, సీసీఐ అధికారులకు సూచించినా ఫలితం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. పది రోజులుగా రైతులు తీసుకువస్తున్న పత్తి నాణ్యత లేదంటూ 8 శాతం తేమ వచ్చినా 12 శాతం తేమతో కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపించింది. నష్టపోకుండా చర్యలు అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సంగెం బొర్రన్న, రైతు వేదిక, జిల్లా అధ్యక్షుడు