
తాంసి, డిసెంబర్ 23: దేశాభివృద్ధిలో రైతులు కీలకమని ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్‌కుమార్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో గురువారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన అనంతపూర్, అంకాపూర్, రాజంపేట, మాదగూడ, సకినాపూర్, పల్సి(కే) గ్రామలకు చెందిన 100 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు రైతులు పాటించాలని కోరారు. వ్యవసాయంలో వస్తున్న శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని సూచించారు. సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ వివిధ పంటలలో చీడపీడల యాజమాన్య పద్ధతులు, పురుగు మందులు వాడేటప్పుడు రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. భూసార పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రైతులకు ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రఘువీర్, కే మమత, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.