మంచిర్యాల, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరవు చాయలు అలముకున్నాయి. కానీ.. రైతు ల కష్టాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. కనీ సం అయ్యో పాపం అన్న నాథుడే లేకుండా పోయాడు. స్వరాష్ట్రంలో తొలి పదేళ్ల పాలనలో పచ్చబడ్డ పొలాలు ఇప్పుడు నీరు లేక ఎండిపోతున్న దృశ్యాలను చూసి, రైతన్నల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రైతుల దగ్గరకు కదిలి వెళ్తున్నారు.
పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో విస్తృతం గా పర్యటిస్తున్నారు. రైతుల కష్టాలు తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ ఉందంటూ దైర్యం చెప్తున్నారు. ఈ క్రమంలోనే రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నారు. సాగునీరు లేక ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినట్లు యాసంగి వడ్లకు కనీస మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ ఇవ్వాలని పోరాటాలు చేస్తున్నారు.
కేసీఆర్ పిలుపు మేరకు ఈ రెండు డిమాండ్లతో ఈ నెల 2వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలు నిర్వహించి నిరసనలు తెలిపారు. సాగునీటి నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన రైతుదీక్షలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు దీక్షల్లో పాల్గొన్నారు. మారుమూ ల పల్లెల నుంచి నియోజకవర్గకేంద్రాల్లో నిర్వహించిన దీక్షలకు తరలివచ్చిన రైతన్నలు పూర్తి మద్దతు ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిర్వహించిన రైతు దీక్షలో మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతోపాటు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి చెన్నూర్‌కు వెళ్లిన బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిర్వహించిన రైతు దీక్షలో మాట్లాడారు. చెన్నూర్‌లో రైతు దీక్ష కోసం ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు టెంట్లు తొలిగించి దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు.
బాల్క సుమన్ రావడానికి ముందే టెంట్లను తొలగించిన పోలీసులు కాసేపటికి తిరిగి ఏర్పాటు చేయించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో నిర్వహించిన రైతు దీక్షలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతుదీక్షలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు దీక్షలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, భైంసా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో బీఆర్ఎస్ నాయకులు రమాదేవి, విలాస్ గాదేవర్, కిరణ్ కొమ్రేవార్ పాల్గొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్‌నాయక్, బోథ్ రైతు దీక్షలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు, రైతులు దీక్షా శిబిరాలకు వందలాదిగా తరలివచ్చారు.
కేసీఆర్ పాలన బాగుండే. కాంగ్రెస్ నాయకుల మాటలు విని మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నం. పదేండ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతున్నా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేర్చలేదు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తదనే నమ్మకం లేదు. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. రైతుబంధు పైసలు రాలేదు. రూ.2 లక్షల రుణమాఫీకి దిక్కులేదు. కరెంటు సమస్యలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. కష్టపడి పండించిన పంటలను కొనేవారు లేక వ్యాపారులకు అమ్మి నష్టపోతున్నాం.
– ధూమల శివ్వన్న, రైతు, జైనథ్ మండలం
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 6 : కాంగ్రెస్ అధి కారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన హామీలను మరచిపోయింది. పథకాల అమలులో విఫలమైంది. ఇప్పటి దాకా రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు. రైతుబంధు అందించ కపోవడం దారుణం. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు తెలుస్తున్నది. ఎకరానికి రూ. 25 వేల చొప్పున పరిహారం అందించాలి. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వం దిగిరాకుంటే రైతుల పక్షాన పోరాటం తీవ్రతరం చేస్తాం.
– కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 6 : కాంగ్రెస్ సర్కారు రైతులకిచ్చిన హామీలు అమలయ్యే దాకా పోరాటం చేస్తాం. నాలుగు నెలల పాలనలో 200 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. నీళ్లివ్వక పంట చేతికొచ్చే దశలో ఎండిపోయాయి. ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలి. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ మళ్లీ మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నది. ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.
– కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు వెంటపడుతామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనం ఎదుట నిర్వహించిన రైతుదీక్షకు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో హాజరైన రైతులనుద్దేశించి రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ 420 హామీలు ఉండగా అందులో వ్యవసాయ రంగానికి సంబంధించి 31 హామీలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలుకాలేదని మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సోయా పంటను విక్రయించి నెల రోజులు గడుస్తున్నా డబ్బులు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను ప్రవేశపెట్టి 720 మంది రైతుల ప్రాణాలు తీసిందన్నారు.
– మాజీ మంత్రి జోగు రామన్న
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అంటేనే రైతు పార్టీ అని ఆదిలాబా ద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. శనివారం నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన రైతు దీక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే’ నినా దంతో కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రుణమాఫీ, ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
– ఆత్రం సక్కు, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి.
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 6 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్లు రైతుల పక్షాన పాలన సాగించారు. చెరువుల్లో పూడిక తీశారు. ప్రాజెక్టులు కట్టించారు. తెలంగాణలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండేది. కానీ కేసీఆర్ మూడు న్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి రాష్ర్టాన్ని తీసుకెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న నాలుగు నెలల్లోనే రైతులను పొట్టగొట్టే దుర్మా ర్గపు చర్యలు చేపట్టింది. రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నరు. 24 గంటల కరెంటిస్తమని చెప్పారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు అందిస్తామన్నరు. ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చింది లేదు. పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సీఎం రేవంత్ మాత్రం క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి.
– బాల్క సుమన్, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు