పెంచికల్పేట్, ఆగస్టు 18 : భార్య కండ్లముందే భర్త పిడుగుపడి మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామంలో ఆదివారం జరిగింది. ఎల్లూరుకు చెందిన సిడం శ్రీనివాస్ (43) వరినాటు కోసం ఉదయం తన పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కూలీలతో కలిసి పొలంలో మందు చల్లుతుండగా ఒక్కసారిగా వర్షం మొదలై అతడిపై పిడుగు పడింది. దీంతో ఆయన అకడికకడే మృతి చెందాడు.
భార్య కాంత కండ్ల ఎదుటే భర్త చనిపోవడంతో అతడి మృతదేహంపై పడి రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. సమీపంలోనున్న కాంత కూడా స్వల్పంగా గాయపడింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొమురయ్య తెలిపారు.