కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో యేటా నకిలీ విత్తనాలు, ఎరువుల దందా జోరుగా సాగుతున్నది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గత సర్కారు ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా, అధికారులు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది.
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు గత సర్కారు ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఒక్కో డీలర్లకు ప్రత్యేకంగా ఐడీలు జారీ చేసింది. లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ తాము కొనుగోలు చేసిన విత్తనాలతో పాటు వాటి రకాలు, నిల్వలు, ధరలు, లాట్ నంబర్లు, ఏ రైతుకు ఎంత విక్రయించారు.. తదితర వివరాలను వ్యవసాయశాఖ పోర్టల్‌లో లాగిన్ అయి నమోదు చేయాలి. ఈ విధానంతో జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారులు స్వయంగా పరిశీలించే వీలుకలుగుతుంది. కానీ, ప్రస్తుతం ఫారం-డీ రూపంలో వ్యవసాయ అధికారులకు మాన్యువల్‌గా సమాచారం అందిస్తున్నారు.
దీని వల్ల ఉన్నతాధికారులకు కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండడం లేదు. దీంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జోరుగా దందా సాగిస్తున్నారు. అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతూ నట్టేట ముంచుతున్నారు. సీజన్ ప్రారంభంలో హడావుడిగా ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసే అధికారులు, ఆ తర్వాత కన్నెత్తి చూడకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ విధానం పక్కాగా అమలు చేస్తే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వానకాలం 4.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 12 పీఏసీఎస్‌లు ఉండగా, 14 రైతు సేవా కేంద్రాలు, 338 ఫర్టిలైజర్స్ దుకాణాలు ఉన్నాయి. వరి విత్తనాలు 13,883.5 క్వింటాళ్లు, పత్తి విత్తనాల ప్యాకెట్లు 7,64,748, కంది 1,788.88 క్వింటాళ్లు, సోయాబీన్ 526.2 క్వింటాళ్ల విత్తనాలు, అలాగే 46 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 23 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 23 వేల మెట్రిక్ టన్నుల పొటాష్, సూపర్‌ఫాస్పేట్ 23 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20 వేల మెట్రిక్ టన్నులు అవసరముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వానకాలం పంటల సాగుకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలకు చెక్‌పెట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.