నేరడిగొండ,జనవరి 6 : మండలంలోని కిష్టాపూర్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ బంగారం, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు నేరడిగొండ ఎస్ఐ సాయన్న తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఉట్నూర్ ఏఎస్పీ ఆదేశాల మేరకు నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కారులో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి బ్యాగులను పరిశీలించగా అందులో బంగారు రంగులో ఉన్న చైను సుమారుగా 1130 గ్రాములు, వంద రూపాయల నోట్ల కట్ట (చిల్డ్రన్ బ్యాంక్ ఇండియా నోట్లపై ఉంది) ఉన్నాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించామని పేర్కొన్నారు.
వారితో పాటు ఇచ్చోడకు చెందిన ఇద్దరు, ఆదిలాబాద్‌కు చెందిన మరో ఇద్దరు మొత్తం ఏడుగురు కలిసి గ్రూపుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని తేలింది. అడ్డదారిలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బంగారం రంగులో గల వస్తువులను నమ్మించి మోసం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ఓ వ్యక్తి వద్ద రూ.2.30లక్షలకు 10 తులాల బంగారం ఇస్తామని నమ్మించి అతని నుంచి రూ.30వేలు తీసుకున్నారు. బంగారం ఇచ్చిన తరువాత రూ. 2 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఓ వ్యక్తి వద్ద కూడా ఇలాగే చెప్పి రూ.80 వేలు తీసుకొని నమ్మించి మోసం చేశారు. నోట్ల కట్టలో పైభాగం, కింద భాగంలో అసలు నోట్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.