నిర్మల్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయం గా కొనసాగుతున్నాయి. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తున్నా చూసీ చూడనట్టుగా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 120 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఇందు లో కొన్నింటికి అనుమతులు ఉండగా.. మరికొన్నింటికి అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు ప్రైవేటు దవాఖానలను జిల్లా అధికారులు హ డావుడిగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నప్పటికీ.. ఆ తర్వాత చర్యల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. రెండు నెలల్లో ఎనిమిది స్కా నింగ్ సెంటర్లు, పది దవాఖానలను తనిఖీ చేశా రు. వీటిలో నిబంధనలు పాటించని ఐదు ఆసుపత్రులను సీజ్ చేశారు.
ఇందులో నలుగురు ఆ ర్ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లు కాగా, ఒక ఈ ఎన్టీ ఆసుపత్రి ఉన్నది. అలాగే ఆరు స్కానిం గ్ సెంటర్లు, మరో మూడు దవాఖానల నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు అధికారు లు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒ త్తిళ్లు వచ్చినప్పుడు తనిఖీలు చేయడంతోపాటు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఆసుపత్రులతోపాటు ఆర్ఎంపీల క్లినిక్‌లపై కూడా ని ఘాను ముమ్మరం చేయాలి.
వైద్యం వ్యాపారమయం
వైద్యం పూర్తిగా వ్యాపారమైంది. ఒకవైపు గుర్తిం పు పొందిన వైద్యులు అధిక ఫీజులు తీసుకుం టూ కోట్లు గడిస్తుండగా, మరోవైపు నకిలీ వైద్యు లు, ఆర్ఎంపీలు వ్యాపారంగా మలచుకుని లక్షలు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 50 శాతానికి పైగా నకిలీ వైద్యులు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్లినిక్‌ల పేరిట చిన్నస్థాయి ఆసుపత్రులనే నిర్వహిస్తున్నారు. అలాగే మరికొందరు డయాగ్నొస్టిక్స్, ల్యాబ్‌ల పేరిట వైద్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
కొంతమంది సీనియర్ డాక్టర్ల దగ్గర పనిచేసే కాంపౌండర్లు, నర్సులు బీపీ చూడడం నుంచి ప్రమాదాల్లో గాయపడిన వారికి కట్లు కట్టడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, స్లైన్ ఎక్కించడం, రోగాన్ని బట్టి మందులు ఇవ్వడం వంటివి నేర్చుకున్న తర్వాత ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి వారు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా దవాఖానలను నడుపుతున్నారు. కొంతమంది ఎలాంటి అర్హత లేకపోయినా శస్త్ర చికిత్సలను చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పలు దవాఖానలు సీజ్
జిల్లా వైద్యాధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలువురు ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లలో నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఇందులో లక్ష్మణచాంద మండల కేంద్రంలోని శాంతి క్లినిక్, వడ్యాల్లోని వాణి క్లినిక్, పరిమండల్లోని హారిక దవాఖానలు ఉన్నాయి. అలాగే ఖానాపూర్ పట్టణంలో గీతా క్లినిక్‌తోపాటు సూర్య ఈఎన్టీ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఖానాపూర్‌లో ఓ ఆర్ఎంపీ నిర్వహిస్తున్న గీతా క్లినిక్‌లో నిబంధనలను అతిక్రమించి ఇంజక్షన్లు ఇస్తున్నారని గుర్తించిన తనిఖీ బృందం ఆసుపత్రిని సీజ్ చేసింది.
అలాగే సూర్య ఈఎన్టీ ఆసుపత్రిని తనిఖీ చేయగా ఇక్కడ అన్ని హంగులు ఉన్నప్పటికీ, రిజిస్టర్డ్ వైద్యులు లేకపోవడం, అలాగే ఈ ఆసుపత్రికి జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమనుతులు లేని కారణంగా దానిని కూడా సీజ్ చేశారు. గత రెండు నెలలుగా కేవలం 10 ఆసుపత్రులను తనిఖీ చేస్తేనే ఐదు నకిలీవని తేలడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న అన్ని ప్రధాన ఆసుపత్రులతోపాటు, గ్రామాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు నిర్వహిస్తున్న దవాఖానలపై దాడులు నిర్వహిస్తే నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మరిన్ని ఆసుపత్రుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉన్నది.
నిబంధనలు..
ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి
ఆర్ఎంపీలు, పీఎంపీలు ఫస్ట్ ఏయిడ్ చికిత్సలకే పరిమితం కావాలి. ఐవీ ఇంజెక్షన్లు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఆసుపత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్లను నియమించుకుని, వారి విద్యార్హతల మేరకే చికిత్స చేయాలి. కనీస నియమాలను పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ కే. రాజేందర్, నిర్మల్ డీఎంహెచ్‌వో