కాసిపేట, మే 14 : కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై తీవ్ర చర్చ సాగుతున్నది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వర్గాల మధ్య పోరు సాగుతుందని ఇటీవల జరిగిన పలు పరిణామాలను బట్టి అర్థమవుతున్నది. సీనియర్స్, జూనియర్స్ గ్రూపుల మధ్య నిత్యం అగ్గి రాజుకుంటుందని తెలుస్తున్నది. ఇటీవల కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకాల విషయమై గ్రూపు తగాదాలు బయట పడిన విషయం తెలిసిందే. రాజీనామాలతో ఈ పంచాయతీ కాస్త గాంధీ భవన్‌కు చేరింది.
ఈ వర్గ పోరు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు తలనొప్పిగా మారిందన్న చర్చ నడుస్తున్నది. బెల్లంపల్లి ఎమ్మెల్యే టికెట్ గడ్డం వినోద్‌కు వచ్చిన తర్వాత.. తన వర్గం వారికే ప్రధాన్యత ఇస్తూ వచ్చారు. ఎమ్మెల్యే గెలిచాక అధ్యక్షుడిగా ఉన్న రత్నం ప్రదీప్‌తో పాటు తన వర్గానికి చెందిన వారికే పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. శాసన సభ ఎన్నికల్లో గడ్డం వినోద్‌కు ప్రేమ్‌సాగర్‌రావు వర్గం పని చేయలేదన్న ఆరుపణల నేపథ్యంలో ఈ రెండు వర్గాల్లో గ్యాప్ పెరిగింది. ఆపై పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరు గడ్డం వినోద్ ఆధ్వర్యంలో చేరినప్పటికీ మంత్రి వివేక్ వర్గంగా ప్రచారంలో ఉంది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వర్గంలోనే మరి కొన్ని వర్గాలు ఏర్పడ్డాయనే విమర్శలున్నాయి. ఇంతలో దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్‌రావును ప్రకటించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సోదరుడు సత్యపాల్‌రావు సైతం పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో మంత్రి వివేక్ తన బలగాన్ని మొత్తం ఇక్కడే దించి పావులు కదిపారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ, విక్రమ్‌రావు ఓటమి చెందగా, ప్రేమ్‌సాగర్‌రావు సోదరుడు సత్యపాల్‌రావు విజయం సాధించారు. ఇక్కడ గడ్డం వినోద్ వర్గానికి చెందిన కొందరు నాయకులు విక్రమ్‌రావు గెలుపుకోసం పని చేయలేదని ఆరోపణలున్నాయి. సత్యపాల్‌రావు గెలిచిన తర్వాత ప్రేమ్‌సాగర్‌రావు వర్గం మండలంలో దూకుడు పెంచింది. ఆపై సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్గాలు బలంగా వారి వారి అభ్యర్థులకు మద్దతు పలికి పోటీ పడ్డారు. ఎక్కువ మంది ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు సర్పంచ్ స్థానాలు సాధించారు.
కానీ, గడ్డం వినోద్ వర్గంలోనే మరి కొన్ని వర్గాలు తయారై ఒకరికి ఒకరు అడ్డు పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇటీవల గడ్డం వినోద్ వర్గం ప్రధాన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న రత్నం ప్రదీప్ వాళ్ల అమ్మకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో వారికే మొత్తం ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వర్గం నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ మండల అధ్యక్షుల నియమాకాల్లో భాగంగా కాసిపేట మండల అధ్యక్షుడిగా పన్నాల మహేశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
పార్టీలోకి కొత్తగా వచ్చిన నేత అధ్యక్ష పదవి దక్కించుకున్నారని ఆరోపణల నేపథ్యంలో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియర్లకు, కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వడం లేదని, కొత్త వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నాయకులు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా నియమించబడ్డ పన్నాల మహేశ్ 15 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేస్తున్నారని, ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం సరైందేనని పలువురు నాయకులు చెప్పారు. దీంతో అధ్యక్ష పదవిపై నీలినీడలు కమ్ముకోగా, ఈ పంచాయతీ కాస్త హైదరాబాద్‌కు చేరుకుంది.
ఇటీవల గాంధీ భవన్ వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఇరు వర్గాల నాయకులు తమ వాదనలు వినిపించారు. అధ్యక్షుడిని మార్చాలని.. మరో వర్గం, తనేనే ఉంచాలని మరో వర్గం నాయకులు తమ అభిప్రాయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. కష్టపడ్డ వారికి న్యాయం చేయాలని మరో వర్గం భీష్మించుకొని కూర్చుంది. ప్రస్తుతం మరో వర్గం సైతం తమకు అధ్యక్షి పదవి కావాలని కొట్లాడుతున్నారు. దీంతో వర్గ పోరు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. ఈ విషయం ఎటూ తేలడం లేదు. కాసిపేట మండల నాయకులు హైదరాబాద్‌కు చేరి, అక్కడే మకాం వేసి మంతనాలు చేస్తున్నారు.
ఇలా కాసిపేట మండల కాంగ్రెస్‌లో ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి పంతం నెగ్గించుకునేందుకు పట్టుబడుతున్నారనే ఆరోపణలున్నాయి. పార్టీలో నియంత్రణ లేకపోవడం వల్ల వర్గ పోరుతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ మొత్తం వర్గాలు విడిపోగా, ఇది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని, పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కింది స్థాయి క్యాడర్ ఆందోళన చెందుతున్నది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాటి నుంచి వర్గ పోరు కొనసాగుతుండగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.