నిర్మల్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : ‘మీ అబ్బాయి ఆటల్లో చాలా చురుకుగా ఉన్నాడు. ఇటీవల నిర్మల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. ఇలాగే ఆడితే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించగలుడు. ఒక్కసారి నేషనల్స్‌కు ఆడితే మీ బాబుకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా ఉంటుంది. భవిష్యత్‌లో సులువు గా ఉద్యోగాన్ని కూడా దక్కించుకోవచ్చు.’ అని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు పేరెంట్ వద్దకు వెళ్లి ప్రలోభపెడుతాడు. దీంతో సదరు పేరెంట్ మా అబ్బాయి నేషనల్స్‌కి ఎంపికవుతాడా? అని తన సందేహాన్ని వ్యక్తం చేస్తూనే, అది సాధ్యమవు తుందా? అంటాడు. దీంతో వెంటనే ఆ పీఈటీ స్పందించి.. నేషనల్స్ కు ఎంపిక కావడం అంటే అది మామూలు విషయం కాదు. డబ్బులు ఖర్చు చేస్తే తప్పకుండా జాతీయస్థాయి పోటీలకు మీ అబ్బాయి ఎంపి కయ్యేలా చూస్తానని హామీ ఇస్తాడు. మీ అబ్బాయి ఆడే ఆటకు సం బంధించి జిల్లా క్రీడా సంఘం బాధ్యుడికి డబ్బులిస్తే పనైపోతుంది. అని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, పూర్తి రహస్యంగా ఉంచాలని చెబుతాడు. దీంతో సదరు పేరెంట్ తన కొడుకు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అడిగినన్ని డబ్బులు ఇచ్చేస్తాడు.
కొంతకాలంగా నిర్మల్ జిల్లాలో క్రీడాసంఘాల బాధ్యులు ఇదే తరహా వికృత క్రీడకు తెరలేపారు. క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. డబ్బులిచ్చిన పేరెంట్స్ ఎవరికీ చెప్పరన్న ధీమాతోపాటు, క్రీడల్లో జరిగే అవినీతిపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి సారించరన్న భావనతో సంఘాల బాధ్యులు కొందరు తమ అవినీతి బాగోతాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసుకునే క్రీడాసంఘాలకు ఆయా క్రీడల రాష్ట్ర అసోసియేషన్ నుంచి కచ్చితంగా గుర్తింపు ఉండాలి. అలాగే కొన్ని క్రీడలకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అప్లియేషన్ ఉండాలి. రాష్ట్ర సంఘాల సమక్షంలో జిల్లా క్రీడా సంఘాలను ఏర్పాటు చేసి, సంఘం బాధ్యుల వివరాలను జిల్లా యువజన క్రీడల అధికారికి అందజేయాలి. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో జిల్లా క్రీడల అధికారి స్వయంగా పాల్గొనాలి. కానీ.. ఈ నిబందనలేవి పాటించకుండానే ఎవరికి వారు క్రీడా సంఘాలను ఏర్పాటు చేసుకుని, ఇష్టారీతిన రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారం రోజుల క్రితం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నెట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. అలాగే గత సెప్టెంబర్‌లో ఇదే స్టేడియంలో రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు జరిగాయి. ఆయా పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే ఈ పోటీల్లో నిబంధనలను పాటించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోటీలను మూడు రోజులపాటు నిర్వహించాల్సి ఉండగా.. కేవలం ఒకటిన్నర రోజులోనే ముగించినట్లు విమర్శలు ఉన్నాయి. పోటీల నిర్వహణను పరిశీలించిన జిల్లా క్రీడల అధికారి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే క్రీడా సంఘాల బాధ్యులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తూతూ మంత్రంగా పోటీలను నిర్వహించి, డబ్బుల వసూళ్లపైనే దృష్టి సారించినట్లు సమాచారం. సరైన వసతులు కల్పించకుండా రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు.
దాతల సహకారంతో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించే క్రీడా సంఘాలు.. ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీలపై దృష్టి సారిస్తాయి. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను గుర్తించి, స్థానికంగా ఉండే వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా రహస్యంగా వారి తల్లిదండ్రులను సంప్రదిస్తారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడించేందుకు వేరువేరుగా రేటును నిర్ణయిస్తారు. సబ్ జూనియర్స్‌కు అయితే రూ.15 వేల నుంచి రూ.20 వేలు, జూనియర్స్‌కు రూ.25వేల నుంచి రూ.40 వేల వరకు, అలాగే సీనియర్స్ విభాగంలో ఆడించేందుకు రూ.50 వేలకు పైగా పేరెంట్స్ నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో క్రీడా సంఘాల బాధ్యులతోపాటు ఓ ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుని పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. క్రీడల్లో ప్రతిభ ఉన్నా లేకున్నా డబ్బులిస్తే చాలు రాష్ట్రం తరఫున నేషనల్స్‌లో ఆడేందుకు అవకాశం కల్పిస్తారు. దీంతో అసలైన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇదే పద్ధతిని స్కూల్ గేమ్స్‌లో కూడా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్రీడల అభివృద్ధిపై దృష్టి సారించి, క్రీడాకారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసేందుకు క్రీడా సంఘాల బాధ్యులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువు రు మాట్లాడుకుంటున్న మాట వాస్తవమే. అయితే బాధి తులు ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. డబ్బులు తీసుకుని క్రీడాకారుల ను ఎంపిక చేయడం వల్ల ప్రతిభ గల వారికి అన్యాయం జరుగుతుంది. ఇటీవల నిర్మల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీల్లో క్రీడాకారులకు సరైన వసతులు కల్పించలేదు. ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా గుర్తింపు ఉన్న క్రీడా సంఘాలు మాత్రమే రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాలి.