మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 8 : ఎక్స్పరీడేట్ మందుల(ఔషధాలు)తో చికిత్స చేసి నవజాత శిశువు ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన మంచిర్యాల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం పుట్టిన ఓ నవజాత శిశువు ఆరోగ్యం బాగోలేక స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలోని ఓ పిల్లల దవాఖానకు తీసుకొచ్చారు. గడిచిన ఏడు రోజులుగా చికిత్స అందిస్తూ రోజు రూ.15 వేల చొప్పున వసూలు చేశారు. అలా దాదాపు రూ.1.05 లక్షలు ఇప్పటికే వసూలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శిశువుకు వైద్యులు రాసిన మెడిసిన్‌ను చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఎక్స్పరీ అయిపోయిన మెడిసిన్‌ను నవజాత శిశువుకు ఇచ్చేందుకు తీసుకొచ్చారని గమనించి డాక్టర్‌ను ప్రశ్నించారు. ఈ మందులు మారుస్తామని, మీ శిశువు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇంకా రూ.50 వేలు కట్టాల్సి ఉందని, అది చెల్లించి రేపు పేషెంట్‌ను తీసుకెళ్లాలని సూచించారు. కాలం చెల్లిన మందులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని, ఏదైనా సీరియసైతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించగా, ఉల్టా మాపైనే డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని బాధిత శిశువు బంధువులు వాపోయారు. ఏ మందులు ఇవ్వాలో మాకు తెలుసునని, ఎక్స్పరీ అయ్యాక కూడా ఈ మందులు ఇవ్వొచ్చంటూ దబాయించారన్నారు.
దీంతో పోలీసులకు ఫోన్ చేసి, మీడియాకు సమాచారం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకొని దవాఖానకు వెళ్లిన మీడియాను చాలా సేపు దవాఖాన నిర్వాహకులు లోపలికి అనుమతించకుండా, బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చివరకు బాధితులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దీనిపై సంబంధిత ఆసుపత్రి వైద్యుడు రఘువంశీని వివరణ కోరగా.. శిశువుకు సరైన వైద్యం అందించానన్నారు. ఎక్స్పరీ ఔషధాలు మెడికల్ ఏజెన్సీకి పంపించాల్సినవి ఉన్నాయన్నారు. రెండేళ్ల క్రితం ఎక్స్పరీ మందులు ఎందుకు దవాఖానలో ఉన్నాయి. అవి శిశువుకు ఇస్తే ఏం జరిగేది. ఎక్స్పరీ డేట్‌ను ఎందుకు మార్క్ చేసి పేషెంట్‌కు ఇచ్చారని ప్రశ్నించగా సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. గతంలోనూ అర్హతలేని ఆర్ఎంపీలు, పీఎంపీలతో మెడికల్ క్యాంప్ నిర్వహించి, వారిని సత్కరించిన ఘటనలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సదరు దవాఖాన యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది.
మీ దవాఖానలో ఏ అర్హతలున్న వైద్యులు పని చేస్తున్నారు. డాక్టర్లుగా వాళ్లకు ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు సమర్పించాలని, అర్హతలేని వారి ఆధ్వర్యంలో ఎందుకు మెడికల్ క్యాంప్ నిర్వహించాల్సి వచ్చింది, ఆ క్యాంప్‌లో వారిని ఎందుకు సత్కరించాల్సి వచ్చింది, నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలని టీఎస్ఎంసీ పేర్కొంది. ఇలా టీఎస్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, గతంలోనూ సదరు ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాశంగా మారింది. మంచిర్యాల జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నవజాత శిశువుకు లక్షల రూపాయల వైద్యం ఎందుకు చేయాల్సి వచ్చిందని, కాలం చెల్లిన ఔషధాలు ఇచ్చి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఘటన వెలుగులోకి వచ్చాక కూడా చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.