మంచిర్యాలటౌన్/నస్పూర్, జూన్ 23: అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలో ఒలింపిక్ రన్-2025ను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ రన్‌ను మంచిర్యాల డీవైఎస్వో హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కుమార్‌దీపక్, ఏసీపీ ప్రకాశ్ క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
అనంతరం ఐబీ చౌరస్తా నుంచి ఒలింపిక్ రన్ మంచిర్యాల పట్టణంలోని వీధుల గుండా క్రీడా పతాకాలతో, క్రీడాకారుల చప్పట్ల మధ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేశ్, జాయింట్ సెక్రటరీ రాంచందర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఫణిరాజా, జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షుడు ముఖేశ్‌గౌడ్, ఎస్సీ కమిషన్ ఈడీ దుర్గాప్రసాద్, డీటీడీవో జనార్దన్, డీఆర్డీవో కిషన్, డీఐఈవో అంజయ్య , సీఐ ప్రమోద్ రావు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 23: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఒలింపిక్ డే రన్ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్, కుమ్రం భీం చౌక్, అంబేదర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా సాగింది. జిల్లా యువజన క్రీడా సర్వీసులు శాఖ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.