Water Problam | కాసిపేట, ఆగస్టు 8 : నీళ్లు లేక వాగులో స్నానాలు చేస్తున్నామని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామ పంచాయతీకి చెందిన సామగూడ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖాళీ బిందెలతో తమ బాధను మహిళలు వివరించారు. ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లకు బాగా గోస పడుతున్నామన్నారు. నీళ్లు లేక వాగులోకి వెళ్లి అక్కడే బట్టలు ఉతుక్కొని అక్కడే స్నానాలు చేసి వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సామగూడెలో 26 కుటుంబాలు జీవిస్తుండగా బోర్ మోటార్ నీళ్లపై ఆధారంగా ఉన్నామన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడో ఒక సారి రావడం, గ్రామంలో ఉన్న చేతి పంపు సరిపోకపోవడంతో నీళ్లకు తీవ్ర గోస పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ప్రధాన నీటి వనరులు బోర్ మోటార్ కాగా అది ఆరు నెలలుగా రిపేర్లో ఉండడంతో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బోర్ మోటార్ మరమ్మత్తులు చేసే వారు లేరని, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందని, తమ గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని మహిళలు వేడుకున్నారు. గ్రామానికి పంచాయతీ అధికారులు ఒక్క సారి కూడా రాలేదని, గ్రామాన్ని పట్టించుకోవడం లేదని. గ్రామంలో పంచాయతీ పరిధిలో చేయాల్సిన పనలు ఏమీ చేయడం లేదని పలువురు గ్రామస్తులు తెలిపారు.
ఈ మేరకు కార్యదర్శి ఉదయ్ వివరణ కోరగా నిన్ననే రిపేర్ అతనికి ఫోన్ చేస్తే నాలుగు రోజుల తర్వాత వస్తా అని చెప్పడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ, చేతి పంపు ద్వారా నీళ్లు అందుతున్నాయన్నారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఉన్నతాధికారులు గ్రామంలో పర్యటించి, సమస్యలు తెలుసుకొని, గ్రామంలో నెలకొన్న నీటి సమస్యలు పరిష్కరించాలని మహిళలు కోరారు.