తాండూర్ : హిందూ సమాజ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్( RSS) ప్రధాన వక్తలు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కవాతు నిర్వహించారు. భారీ కవాతు ( Parade ) లో స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కిష్టంపెట్ విద్యాభారతి హైస్కూల్ నుంచి ప్రారంభమైన కవాతు ఇరువైపుల నుంచి వచ్చిన కార్యకర్తలు మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తా శివాజీ చౌక్ వద్ద ఏకమై, అక్కడి నుంచి ప్రధాన విధుల గుండా జాతీయ రహదారి మీదుగా కొనసాగింది. ఈ కవాతులో భరతమాత, డాక్టర్ జీ, గురూజీ చిత్రపటాలతో పాటు భగవధ్వజంతో ఊరేగారు.
దారి పొడవునా స్థానికులు, మహిళలు భగవాద్వజంపై పూలు చల్లుతూ మంగళ హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, గణవేషధారి , స్వయం సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తలు మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామగ్రామాన స్వయం సేవక్ సంఘ్ విస్తారించాలని, దేశాభివృద్ధే లక్ష్యంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రజలలో దేశభక్తి పెంపొందిస్తూ సంఘటితంగా ఉండడానికి, స్ఫూర్తిని నింపుతూ కవాతు నిర్వహించిందన్నారు.