భీంపూర్, జూన్17: సీమాంధ్ర పాలనలో ఎక్కడ చూసినా ఎడారి వా తావరణమే. తెలంగాణ ఏర్పాటయ్యాక నిరంతరం హరితహారం కార్యక్రమాలతో ప్రతి గ్రామం, పట్టణం పచ్చదనంతో వెల్లివిరుస్తున్నది. భీంపూర్ మండలంలోని 26 పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్లోనాటిన మొక్కలు వృక్షాలుగా మారుతున్నాయి.
ప్రకృతి వనాలు, నర్సరీలతో మేలు
కరంజి(టి) తదితర గ్రామాల్లో పల్లెప్రకృతివనాలతో పాటు మెగా పార్కులు ఉన్నాయి. కరంజి(టీ), భీంపూర్, గుబ్డి, అంతర్గాం, అర్లి(టి), కామట్వాడ ప్రకృతివనాలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యవాతావరణం కల్పిస్తూ సందర్శకులు వచ్చేలా చేస్తున్నాయి. సర్పంచులు, కార్యదర్శు లు, జీపీ కార్మికులు మొక్కల రక్షణకు నిరం తరం శ్రమిస్తున్నారు. మండల, జిల్లా అధికారుల నిరంతర పర్యవేక్షణలతో ప్రతి మొక్కా సద్వినియోగమవుతున్నది. కరంజి(టీ) లాంటి వనాలు షార్ట్ఫిల్మ్లు తీసేలా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
ప్రతి పంచాయతీకో నర్సరీ..
ప్రభుత్వం ఏటా హరితహారం కోసం గ్రామాలకు మొక్కలు పంపిణీ చేసేందుకు ఇపుడు దగ్గరి పంచాయతీలోనే ఈజీఎస్ నర్సరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ నర్సరీల్లో 20- 50 రకాల వివిధ జాతుల మొక్కలను సంరక్షిస్తున్నారు. ఈజీఎస్ సిబ్బంది ,పంచాయతీ సమన్వయంతో ప్రతి హరితహారం వందశాతం విజయవంతమవుతున్నది. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, రైతువేదిక, పంచాయతీ, గుడి, బడి, పీర్ల చావిడి ఇలా అన్నీ హరితమయంగా మారాయి.
2.60 లక్షలు మొక్కలు నాటమే లక్ష్యం
ప్రస్తుత హరితహారంలో 26 పంచాయతీలు, అనుబంధ గ్రామాలకు కలిపి 2.60 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి నర్సరీలోని మొక్కలు ఏ గ్రామానికి ఎన్ని అవసరమో ఇండెంట్ రూపొందిస్తున్నారు. ఒక్క మొక్క వృథాగా పోయినా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు ఇప్పటికే హెచ్చరికలు చేశారు.
పచ్చదనం పెంపొందిస్తాం
ప్రభుత్వం పచ్చదనం, పరిశుభ్రత పనులకు జీపీలకు ట్రాక్టర్లు ఇచ్చింది. అన్ని సౌకర్యాలు కల్పించింది. అభివృద్ధి పనులు ఉత్సాహంగా చేసుకోగలుగుతున్నాం. మా ప్రకృతివనం, నర్సరీ ఆదర్శంగా ఉన్నాయి. ఈ సారి మరింత పకడ్బందీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతాం. మా మండలంలో కరంజి(టీ) లాంటి పంచాయతీలలో పార్కులు చూడచక్కగా ఉన్నాయి. ఇతర గ్రా మాలవారు సందర్శిస్తుంటారు. పచ్చదనం ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– మడావి లింబాజీ ,సర్పంచ్ భీంపూర్