కుభీర్ : మొక్కజొన్న కొనుగోళ్ల ( Maize procurement ) మాటున ప్రభుత్వం లేనిపోని కొర్రీలను విధిస్తూ రైతులను నట్టేట ముంచేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గం సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ( Dr. Kiran Komrewar ) ఆరోపించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ తో కలిసి మాట్లాడారు.
గతేడాది కంటే మొక్కజొన్న సాగు రెట్టింపు అయినప్పటికీ తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుభీర్ మండలంలోనే 16 వేల ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఒకటే కేంద్రాన్ని కుభీర్‌లో ఏర్పాటు చేశారని ఆరోపించారు. కొనుగోలులో అనేక ఆంక్షలు విధిస్తూ ఎకరానికి 25 కుంటలు మాత్రమే తూకం వేస్తామని, అందులోనూ 14 శాతం మాత్రమే మాయిశ్చర్ ఉండాలంటూ కొర్రీలు పెట్టడం చూస్తుంటే రైతులను నష్టాల్లోకి నెట్టడమేనని అన్నారు.
తానూర్‌లో నాలుగు, ముధోల్, బాసర, లోకేశ్వరం, కుంటాల తదితర మండలాల్లో మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన మొక్కజొన్నను బేసరత్తుగా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో మొక్కజొన్న రైతుల పక్షాన ఆందోళనలకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.
అంతకుముందు ఇటీవల మృతి చెందిన దేవకర్ సంతోబా, షేక్ అహ్మద్ పాషా, గోరేఖర్ పాపన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుభీర్ కు చెందిన పుప్పాల శ్రీనివాస్ మొక్కజొన్న చేను ప్రమాదవాశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరి వెంట బీఆర్ఎస్ కుభీర్ గ్రామ అధ్యక్షులు డాక్టర్ పోశెట్టి, గ్రామ ఉపసర్పంచ్ గంగాధర్, వార్డ్ మెంబర్లు ధనగారి నాగేష్, షేరే భూమన్న, హేమలే సుభాష్, ముచ్చిండ్ల విట్టల్, బాబు మాజీ సర్పంచ్ బాబు, గిరి పోశెట్టి, దేవ రెడ్డి, కాశీనాథ్, పుప్పాల సునీల్, సాయినాథ్, దొంతుల దేవీదాస్, ఖయ్యూంమేస్త్రి, గణేష్ తదితరులు ఉన్నారు.