బోథ్/తాంసి/ఇచ్చోడ/ఖానాపూర్, డిసెంబర్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మహిళలు ఆటోలు ఎక్కడం లేదని, దీంతో ఉపాధి కోల్పోయామని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని ఆర్టీసీ బస్సు ఎదుట ఏఐటీయూసీ అనుబంధ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండలాధ్యక్షుడు సగిర్ అహ్మద్ ఆధ్వర్యంలో, ఇచ్చోడలో సహారా జీప్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలోని అంతర్జాతీయ రహదారిపై తాంసి, తలమడుగు, ఆదిలాబాద్ మండలాల ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.
అలాగే నిర్మల్ జిల్లా ఖానాపూర్లోఎన్టీఆర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఖానాపూర్, కడెం, పెంబి ఆటో డ్రైవర్ల యూనియన్ సంఘ నాయకులు, డ్రైవర్లు ఆటో, టాటా మ్యాజిక్‌లతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆటోలు నడుపుకుంటూ ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఉచిత ప్రయాణం వల్ల మహిళలు ఆటోల్లో ఎక్కడం లేదన్నారు. దీనివల్ల తమకు గిరాకీ లేక నష్టపోతున్నామని, కుటుంబ పోషణకు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, ప్రతినెలా జీవన భృతి 10వేలు, ప్రతి ఆటో డ్రైవర్‌కు జీవిత బీమా 5లక్షల పాలసీ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుమేర్ పాషా, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు దళిత్ ఆనంద్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.