ఆదిలాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);రైతన్నకు అండగా గులాబీ దళం కదంతొక్కింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ కర్షకులు, శ్రేణులు కదిలిరావడంతో రహదారులను దిగ్బంధించింది. మూడు గంటలపాటు వందలాది వాహనాలు పదుల కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. బుధవారం నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్.. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్-చాందా(టీ) ఎక్స్‌రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కడ్తాల్ వద్ద ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించగా.. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఎక్స్‌రోడ్డు వద్ద ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొని.. జై కేసీఆర్.. మోదీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వం, మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయగా.. వరి కంకులు, వడ్లు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు.
వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ చేపట్టిన రెండో విడుత ఉద్యమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఆందోళన కార్యక్ర మాల్లో భాగంగా బుధవారం నాగ్‌పూర్ జాతీయ రహదారి దిగ్బంధం విజయవంతమైంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉదయం నాగ్‌పూర్ జాతీయ రహదారిపైకి చేరుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వారి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వద్ద జరిగిన రాస్తారోకోలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించగా.. రాష్ట్ర దేవాదా యశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన నేషనల్ హైవే దిగ్బంధనంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్‌లు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో మధ్యాహ్నం వరకు కొనసాగింది. రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి.
రైతును ఏడిపిస్తే బాగుపడరు..
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 6 : రైతును ఏడిపించే పాలకులు బాగు పడరని, కేంద్రానికి కచ్చితంగా గుణపాఠం తప్పదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని జాందాపూర్-చాందా ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగంపై కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ రైతాంగంపై కక్షగట్టిందని, వడ్లు కొనకుండా అన్యాయం చేస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ రైతును రాజును చేసే దిశలో అనేకానేక పథకాలు అమలు చేస్తుంటే, కేంద్రం రైతులను నూరేండ్ల వెనక్కు తీసుకెళ్లే యత్నం చేస్తున్నదని విమర్శించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. రైతులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. కేంద్రం దిగిరాకపోతే రైతులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ప్రజాప్రతినిధులు, రైతులు వరికంకులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అఢ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల రైతులు పాల్గొన్నారు.
కేంద్రం తీరు సక్కగ లేదు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు సక్కగ లేదు. రైతులకు ఇంత అన్యాయం జేసుడు దారుణం. రాష్ట్రంల సీఎం కేసీఆర్ సారు రైతులను మంచిగ అర్సుకుంటాంటే మోదీ సారు కార్పొరేట్ సంస్థలకు న్యాయం చేస్తున్నడు. వాళ్లు ఇయ్యరు.. ఇంకొకలను ఇయ్యనీయరు.. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరంట్ లాంటివి ఇచ్చి కేసీఆర్ సారు దేవుడిలా కనిపిస్తున్నడు.. వడ్లు కొనబోమని, మోటర్ల కాడ మీటర్లు పెడుతమని, పెద్దోళ్లకు రాయితీలు ఇస్తమని మోదీ సారు ఎట్ల కనపడుతుండో జనమంతా చెప్పుకుంటున్నరు. కొన్ని రాష్ర్టాల్లో కొని మాకాడ కొనకుంటే మేం ఎందుకు ఉకుంటం. లోకల్ బీజేపీ లీడర్లు దీనికి సమాధానం జెప్పాలె. కేంద్రాన్ని వడ్లు కొనమని అడగాలె. లేకుంటే వాళ్లకు రైతులే బుద్ధి చెబుతరు.
–మరా ఇస్తారి, రైతు, మాదాపూర్, సోన్ మండలం
చేతగాకపోతే గద్దె దిగాలే..
కేంద్ర ప్రభుత్వానికి వడ్లు కొను డు చేతగాకపోతే గద్దె దిగాలే. రైతులను ఆదుకునుడు తెల్వుదు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు న్యాయం జేసుడు తెల్వదు. గిట్టుబాటు ధర ఇచ్చుడు తెల్వదు.. పంటలకు సాయం చేసుడు తెల్వదు. కానీ, పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చుడు తెలుసు.. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్ముడు తెలుసు. ఉద్యోగాలు ఉడగొట్టుడు తెలుసు.. సీఎం కేసీఆర్ లాంటి లీడర్ కేంద్రంలో ఉంటే దేశం మొత్తం రైతాంగానికి న్యాయం జరిగేది. కేంద్రంలో బీజేపీకి నూకలు చెల్లినయ్. ఆ పార్టీ లీడర్లు కూడా నోటికొచ్చినట్లు రైతుల మీద మాట్లాడుతున్నరు. ఇగ ఆల్లకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డయ్. – ఇందూర్ లక్ష్మణ్, కూచన్‌పల్లి, సోన్ మండలం
పేదోళ్ల కంటే పెద్దోళ్లే బీజేపీకి ఇష్టం
బీజేపీ లీడర్లకు ముందునుంచి పేదోళ్ల కంటే పెద్దోళ్లే ఇష్టం. పెట్టుబడి దారులకు మంచిజేసుడు మాత్రమే వాళ్లకు తెలుసు. రైతులను ఏనాడూ పట్టించుకున్నది లేదు. పైగా ఎవుసాన్ని నాశనం చేసే పనులు మొదలు పెడుతరు. అదానీ, అంబానీలకు మంచి జేసుడు.. వాళ్లకు అవసరమున్నట్లు ఉపయోగించుకు నుడు. పేదోళ్లు, రైతులు ఏం జేస్తరు పాపం.. ఆరుగా లం కష్టపడి పంటను పండిస్తే మంచి ధర ఇచ్చుడు కూడా ఈ కేంద్రమోళ్లకు చేతగాదు.. పైగా మేం అది కొనం.. ఇది కొనం అని కొర్రీలు.. ఇది గట్లున్నది.. అది ఇట్లున్నది.. అని వంకలు.. ఈల్లకు పంటల గురించి తెలిస్తే కదా.. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా మూటగట్టుకున్నరు. ఇంకా ఏం చేస్తరు. వడ్లు కొనకుంటే ఈసారి మా ఊసురు తాకుతది. – బీ రమేశ్, మోదనాపూర్, కుంటాల మండలం
ఉసురు తగులుతది..
సీఎం కేసీఆర్ సారు రైతులకు అన్నదమ్మునితీరు రైతు బంధు, బీమా, కరంటు ఇస్తున్నడు. ఇగ కేంద్ర మోళ్లు ఏమో తెలంగాణ అరి పంట కొనమని చెప్పుడు న్యాయం కాదు. అరి అంటె లక్ష్మి.లోకంకు అన్నం. గా పంటనే అద్దని మోదీసారు అంటున్న డంటే.. ఇగ ఆయనేం లీడరు..వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అట్టిగనే అనలే. రైతులను గింత గానం తరాసవెడ్తున్న సెంటరుల ఉన్న బీజేపీకి ఇగ నూకలు చెల్లినట్లే . మా ఉసురు తలిగి ఎటూగాకుం టవోతరు . ఏదేమన్నగానీ రైతులందరం గీ ధర్నాలు ఆపేదిలేదు. కేంద్రం దిగి అచ్చేదాక మేము ఉకుండము. బీజేపొళ్లను గట్టిగనే అర్సుకుంటం.
– పడకంటి నర్సమ్మ ,జైనథ్ మండలం