ఉద్యోగార్థులకు వరంగా మారుతున్న గ్రంథాలయాలు
అందుబాటులో లక్షలాది పుస్తకాలు, స్టడీ మెటీరియల్
ఆధునిక హంగులతో భవనాలు.. అన్ని రకాల వసతులు..
‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ ద్వారా బుక్స్ కొనుగోలు
మహిళలకు ప్రత్యేక రీడింగ్ రూమ్స్ ఏర్పాటు
ఆహ్లాదకర వాతావరణంలో ప్రిపరేషన్
పుస్తకశాలల్లోనే అధిక సమయం ఉంటున్న ఉద్యోగ అభ్యర్థులు
ఆదిలాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రంథాలయాలు.. కొలువుల కేంద్రాలుగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న లైబ్రరీలు స్వరాష్ట్రంలో ఆధునిక తను సంతరిం చుకున్నాయి. డిజిటల్ హంగులతో దర్శనమిస్తు న్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కొట్లాది రూపాయలతో సకల సౌకర్యాలు కల్పించ డంతోపాటు లక్షలాది బుక్స్‌ను అందుబాటులో పెట్టారు. గ్రంథాలయాల్లో ప్రిపరేషన్ అయిన వందలాది మంది ఉద్యోగాలు సాధించారు. తాజాగా.. ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటించారు. దీంతో ఉద్యోగార్థులు పుస్తకశాలలకు క్యూ కడు తున్నారు. కొలువు కొట్టాలనే లక్ష్యంతో గంటల తరబడి పుస్తకా లతో కుస్తీ పడుతున్నారు. ప్రత్యేక రీడింగ్ రూమ్స్ ఉండడంతో మహిళలూ అధికంగా వస్తున్నారు. ఇంకా.. ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ ద్వారా ఉద్యోగ అభ్యర్థులు కోరుకున్న బుక్స్‌ను సిబ్బంది అందుబాటులో పెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అభ్యర్థులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రంథాలయాల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ లైబ్రరీల ప్రక్షాళనపై దృష్టిసారించారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం, ఆధునిక సౌకర్యాలతో మౌలిక వసతులు కల్పించడం, అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు చేశారు. ఫలితంగా పాఠకుల సంఖ్య పెరగడంతో విస్తృతంగా పేపర్లు, బుక్స్ కొన్నారు. ఉద్యోగార్థుల కోసం స్పెషల్‌గా పేపర్, బుక్, కంప్యూటర్ సెక్షన్, రీడింగ్ హాల్ వంటి గదులు నిర్మించారు. ఏసీలు, వైఫై వంటి సౌకర్యాలు కల్పించారు. మహిళలకు ప్రత్యేక రీడిం గ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. డిజిటల్ పాఠా లు చదువుకునే అవకాశం కూడా కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాత పుస్తకాలను మాత్రమే చదువుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు లైబ్రరీలకు వచ్చే వారు కోరుకున్న పుస్తకాలను ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఇందుకోసం ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ద్వారా రిజిష్టర్‌లో పాఠకులు, నిరుద్యోగులు తమకు అవసరమైన పుస్తకం పేరు రాస్తే అధికారులు వాటిని మార్కెట్లో కొనుగోలు చేసి లైబ్రరీలో అందుబాటులో పెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడంతో రోజూ గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచడంతో ఉద్యోగార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అభ్యర్థులు కూడా ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడి చదువుతున్నారు.
విద్యార్థుల కోరిన పుస్తకాలు తెప్పిస్తున్నాం..
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న సహాయ, సహకారాలతో ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయాన్ని రూ.3.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. మహిళల కోసం అన్ని సౌకర్యాలతో ప్రత్యేక గదిని నిర్మించాం. లైబ్రరీలో 52 వేల పుస్తకాలు అందుబాటులో ఉండగా వివిధ పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం అవసరమైన బుక్స్ ఉన్నాయి. విద్యార్థులు తమకు అవసరమైన పుస్తకాలను అడిగితే వెంటనే తీసుకువచ్చి అందిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో లైబ్రరీకి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. నిరుద్యోగులు గ్రంథాలయానికి వచ్చి కష్టపడి చదువుని ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుతున్నాం.
– రౌతు మనోహర్, ఆదిలాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్
18 లైబ్రరీలు.. 1,47,543 పుస్తకాలు
ఆదిలాబాద్ జిల్లాలో 18 గ్రంథాలయాలు ఉండగా.. వీటిలో విద్యార్థులకు అవసరమైన 1,47, 543 పుస్తకాలు ఉన్నాయి. ప్రభుత్వం లైబ్రరీలకు వచ్చే వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 52 వేల పుస్తకాలు ఉండగా.. రీడర్స్ ఆన్ డిమాండ్ విధానంలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను సిబ్బంది కొనుగోలు చేస్తున్నారు. ఇక్క డ మహిళల కోసం ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించారు. సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన అనంతరం చాలా మంది లైబ్రరీకి వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.
16 లైబ్రరీలు.. 1,32,483 పుస్తకాలు
నిర్మల్ జిల్లాలో 16 గ్రంథాలయాల ఉండగా.. 1,32,483 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు ఇక్కడికి వచ్చి పోటీ పరీక్షల పుస్తకాలు చదువుకుంటున్నారని సిబ్బంది తెలిపారు. ఇక్కడ చదువుకున్న వారు పోలీసు, జూనియర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు సంపాదించినట్లు వారు పేర్కొన్నారు. ప్రభు త్వం కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సంపాదిస్తామని పలువురు పేర్కొంటున్నారు.
పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పిస్తాం..
నిర్మల్ గ్రంథాలయంలో విద్యార్థులకు అసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు 22 మందికి పోలీస్, జూనియర్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలు వచ్చాయి. లైబ్రరీలో రూ.20 లక్షలతో విశాలమైన హాల్‌ను నిర్మించాం. వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇందులో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. భోజనం వసతి కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కొత్తగా రూ.1.50 కోట్లతో మంజూరు చేసిన ఈ-లైబ్రరీ పనులను త్వరలో ప్రారంభిస్తాం.
– ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్
14 లైబ్రరీలు.. 1,26,045 పుస్తకాలు
మంచిర్యాల, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉండగా, 14 మండలాల్లో శాఖా గ్రంథాలయాలు ఉన్నా యి. వీటిలో మొత్తం 1,26,045 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో పోటీ పరీక్షలకు సంబంధించి 9,702 పుస్తకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండడం, గ్రంథాలయాలకు పాఠకుల సంఖ్య పెరగనుండడంతో సరిపడా పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి శాఖా గ్రంథాలయంలో ఆన్ డిమాండ్ పుస్తకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. గ్రంథాలయ పాఠకులు కోరిన పుస్తకం రిజిస్టర్లో రాసిన 4, 5 రోజుల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ తెలిపారు. సివిల్స్ కం గ్రూప్స్‌కు ఉపయోగపడే ఎన్సీఈఆర్టీ, సీబీఎస్‌తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
9 లైబ్రరీలు.. 73 వేల పుస్తకాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో 825 పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 లైబ్రరీలు ఉండగా, వీటిలో 73, 360 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దినపత్రికల తోపాటు ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన మెటీరియల్స్ అందుబాటులో ఉంచారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం స్టడీ సర్కిల్లో పేర్లు నమోదు చేసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 9 లైబ్రరీలకు ప్రతిరోజూ 1000 నుంచి 1200 మంది వరకు వస్తూ ప్రిపేర్ అవుతున్నారు. లైబ్రరీలలో తాగునీటితో పాటు అన్ని వసతులు ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు అక్కడే ఉండి ప్రిపేర్ అవుతున్నారు.
అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తాం
వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుండడంతో లైబ్రరీలకు చాలా మంది వస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్ డిమాండ్ పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం. మౌలిక వసతుల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ నోటిఫికేషన్లకు అనుగుణంగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖ గ్రంథాలయాల్లోనూ సౌకర్యాలు కల్పించి, కొలువుల కోసం ప్రిపేరయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. నిపుణులతో శిక్షణ ఇప్పించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించేలా ప్రణాళిక చేస్తున్నాం.
-రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మంచిర్యాల
అవసరమైన పుస్తకాలను తెప్పిస్తాం
ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో లైబ్రరీలకు అభ్యర్థులు ఎక్కువగా వస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 9 లైబ్రరీలు ఉన్నాయి. 73 వేలకు పైగా పుస్త కాలు, అన్ని రకాల దినపత్రికలు అందుబా టులో ఉన్నాయి. ఇంకా అభ్యర్థులు ఏవైనా పుస్తకాలు కావాలని కోరితే తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతున్నాం. జిల్లా కేంద్రంలో కొత్త లైబ్రరీ నిర్మాణానికి రూ. కోటీ 50 లక్షలు మంజూరయ్యాయి.
–కనక యాదవ్రావ్, ఆసిఫాబాద్ గ్రంధాలయ సంస్థ చైర్మన్