కుమ్రం భీం ఆసిఫాబాద్/ఆదిలాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు అతివలకు ఆరోగ్యరీత్యా తీపికబురు అందించింది. ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పీహెచ్సీ, యూహెచ్‌సీ, బస్తీ దవాఖానల్లో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నది. వీటిలో ప్రతి మంగళవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించనుండగా.. 57 రకాల టెస్టులు చేసి..24 గంటల్లోనే రిపోర్టులు అందించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రయోగాత్మకంగా పదింటిని ఎంపిక చేసింది. కాగా.. ఫలితాలను బట్టి భవిష్యత్తులో విస్తరించనున్నారు. వైద్య పరీక్షలపై ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. ప్రతి జిల్లాకేంద్రంలోని పెద్దాసుపత్రుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు కూడా ఉంటాయి. నేటి నుంచి అందుబాటులోకి రానుండగా.. మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు ప్రారంభించనున్నారు.
మహిళలు ఆరోగ్య పరంగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మహిళా క్లినిక్‌లను ప్రత్యేకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిం ది. దహెగాం, గిన్నెధరి పీహెచ్‌సీల్లో ఈనెల 8 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. దీనికోసం వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది..
మహిళలకోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 మహిళా క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. దీంట్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో పది మహిళా క్లినిక్‌లను ప్రారంభించనున్నది. ఇందులో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధరి, దహెగాం పీహెచ్‌సీలు.మంచిర్యాల జిల్లాలో నాలుగు పీహెచ్‌సీలను ఎంపిక చేశారు. జన్నారం పీహెచ్సీ, బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పీహెచ్ సీ, జైపూర్ మండలంలోని కుదారం పీహెచ్సీ, మంచిర్యాల జిల్లాకేంద్రంలోని హమాలీ వాడలోని బస్తీ దవాఖానను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజార్ హత్నూర్ పీహెచ్సీ, ఆదిలాబాద్ పట్టణంలోని హమాలీవాడ యూ హెచ్సీని ఎంపిక చేశారు.నిర్మల్ జిల్లాలో రెండు దవాఖానలను ఎంపిక చేశారు. నిర్మల్ పట్టణంలోని నాలుగో వార్డు బంగల్‌పేట్‌లో గల అర్బన్ హెల్త్ సెంటర్, భైంసా పట్టణంలోని కుంట ఏరియాలోని పీహెచ్సీ. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళా క్లినిక్‌ల నిర్వహణకు పూర్తిస్థాయిలో మహి ళా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ క్లినిక్‌లలో మహిళలకు ప్రత్యేకంగా టెస్టులు చేస్తారు. 57 రకాల పరీక్షలు చేస్తారు. చికిత్స అందించడంతోపాటు మందులు కూడా ఉచితంగానే ఇస్తారు. క్యాన్సర్, బీపీ, షుగర్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్పెక్షన్స్, పీసీడీవో, వెయిట్ మేనేజ్మెంట్, రుతుస్రావ పరీక్షలతోపాటు పలు రకాల టెస్ట్‌లు చేస్తారు.
24గంటల్లో పరీక్షల రిపోర్టులు..
ఈ క్లినిక్‌లలో మహిళల వైద్యపరీక్షలకు సంబంధించి 24 గంటల్లో పరీక్షల రిపోర్టులను తెప్పించుకుంటారు. దీనికోసం జిల్లా కేంద్రంలోలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌ను వినియోగించుకోనున్నారు. మహి ళా క్లినిక్‌లో నిర్వహించిన టెస్ట్‌ల వివరాలను డయాగ్నోస్టిక్ పోర్టల్ ప్రత్యేక లింక్‌లో అందుబాటులో ఉంచుతారు. అన్ని వయసుల వారికి మహిళల ప్రత్యేక క్లినిక్‌లలో వైద్యసేవలు అందిస్తారు. ఇందు కోసం ఉమెన్స్ క్లినిక్‌లలో ఉండే సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే టెస్ట్ షాంపిల్స్‌ను డయాగ్నోస్టిక్ సెంటర్లకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.
యాప్‌లో వివరాలు..
ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే ప్రాథమికంగా మందులు ఇచ్చి పంపిస్తారు. టెస్ట్ రిపోర్టులు వచ్చిన తర్వాత అవసరమైతే జిల్లా కేంద్రంలోని దవాఖానకు రెఫర్ చేస్తారు. దీనికోసం ఓ యాప్‌ని రూపొందిస్తున్నారు. క్లినిక్‌కు వచ్చిన మహిళల వివరాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే వైద్యశాల రిఫరల్ లింక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మహిళ వైద్యశాలలో చేరిన తర్వాత ఎలాంటి చికిత్స అందుతుందనే వివరాలు కూడా తెలుస్తాయి. వైద్యాధికారులు స్వయంగా మహిళల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు.
నేడు ప్రారంభం
రాబోయే రోజుల్లో ఈ క్లినిక్‌లను మరింత విస్తరించనున్నారు. 57 రకాల పరీక్షలతోపాటు పోషకాల లోపం, పీసీవోడీ, సంతాన లేమి, మోనోపాజ్, ఐవీ తదితరల సమస్యలకు చికిత్స అందిస్తారు. క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు ఉంటే నిమ్స్, ఎంఎన్‌జే వంటి ప్రధాన వైద్యశాలలకు పంపిస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 8న ప్రత్యేకంగా మహిళా క్లినిక్‌లకు అందుబాటులోకి తీ సుకురావడంపై మహిళల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ప్రతి మంగళవారం జిల్లాలోని దహెగాం, గిన్నెధరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళా క్లినిక్‌లను ని ర్వహించనున్నారు. దహెగాం పీహెచ్సీలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తిర్యాణి మండలంలోని గిన్నెధరి పీ హెచ్సీలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రారంభిస్తారు. మంచిర్యాల బస్తీ ద వాఖానలో కలెక్టర్ బదావత్ సంతోష్, మిగతా చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్, నిర్మల్ పట్టణంలోని నాలుగో వార్డు బంగల్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, భైంసా పట్టణంలోని కుంట ఏరియా పీహెచ్సీలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ప్రారంభించనున్నారు.