మంచిర్యాలటౌన్, డిసెంబర్ 4: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్రావుతో కలిసి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ అండదండలతో అత్యుత్సాహం ప్రదర్శించి, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ తమ అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేయడానికి అధికారులు సహకరించారని, మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ నాలుగున్నరకు కార్యాలయం వెనక తలుపు నుంచి అభ్యర్థిని లోపలికి అనుమతించి ఆమె చేత విత్‌డ్రా చేయించారన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆర్వో, ఎస్ఐ ఇందుకు సహకరించారని, వారిని వెంటనే ఉద్యోగంలో నుం చి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దృష్టి కి సైతం తీసుకెళ్లామని, తుది నిర్ణయం ఆర్వోదే ఉంటుందని ఆయన చెప్పి, ఏమైనా అ భ్యంతరంముంటే ఫిర్యాదు చేయాలని సూ చించారని అన్నారు. ఈ విషయంపై తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. దండేపల్లి మండలం పాతమామిడిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాధవిని బీఆర్ఎస్ బలపరిచిందని, ఆమె చేత బలవంతంగా విత్ డ్రా చేయించారని, గడువు ముగిసిన తర్వాత కూడా 4.20 గంటలకు కార్యాలయంలోకి పంపించారన్నారు.
అధికారులు ఎన్నికల ని బంధనలను తుంగలో తొక్కి, అధికార పార్టీకి తొత్తులుగా మారారని, రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అత్తి సరోజ, గోగుల రవీందర్‌రెడ్డి, గాదెసత్యం, పల్లె భూమేశ్, శ్రీపతివాసు, వంగ తిరుపతి పాల్గొన్నారు.