ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబర్ 6 అంకోలిరోడ్లో కుంట ప్రాంతంలో 20 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. ఇక్కడ చిన్న కుంట ఉండడంతో అందులోకి నీటి ప్ర వాహంలో నుంచి పాములు, కీటకాలు ఇండ్లల్లోకి వస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు. రాత్రి సమయంలో కుక్కలు తిరుగుతుండడంతో వీధి లైట్లు వెలగకపోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయపడుతున్నారు. లైట్లు పెట్టాలని మున్సిపాలిటీ కా ర్యాలయానికి పోయి ఇంజినీరింగ్ అధికారులను పలుమార్లు కోరినా లైట్లు రిపేర్కు ఇ చ్చాం. అయినా తర్వాత పెడుతామని సమాధానం ఇస్తున్నారని స్థానికులు తెలిపారు.
ఆదిలాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అంధకారం నెలకొన్నది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఓ వైపు వర్షం మరోవైపు లైట్లు వెలగక చీకటి కమ్ముకోవడంతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని జనం భయపడుతున్నారు. గతంలో తమ సమస్యలను కౌన్సిలర్లకు విన్నవించి పరిష్కరించే అవకాశం ఉండగా.. బల్దియా పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ఎవరికి చెప్పినా సమస్యలు పరిష్కారం కావగం లేదని పట్టణ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉన్నాయి. వీటిలో పది వార్డులు గ్రామ శివారు ప్రాంతాలతో పాటు స్లమ్ ఏరియాల్లో ఉంటాయి.
మున్సిపాలిటీ పరిధిలో 14 వేల వీధి దీపాలు ఉండగా గతంలో ఓ ప్రైవేట్ ఏజెన్సీకి వీటి బాధ్యతను అప్పగించారు. గతేడాది నవంబర్లో గడువు ముగియడంతో ప్రస్తుతం మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వీధి దీపాల నిర్వహణ చూస్తున్నారు. జిల్లాలో ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో నగరంలోని నడిబొడ్డున ఉన్న ప్రధాన వార్డులతో పాటు ఇతర వార్డుల్లో వీధి దీపాలు పాడయి వెలగడం లేదు. రోజుల తరబడి వీధి దీపాలు వెలగడం లేదని మున్సిపాలిటీ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందిని అడిగితే కొత్త లైట్లు లేవు, లైట్లు రిపేర్కు ఇచ్చాం, రేపు, ఎల్లుండి వచ్చి పెడుతామని సమాధానం ఇస్తున్నారని పట్టణవాసులు చెబుతున్నారు. వీధుల్లో వరద ప్రవహించడం, పశువులు రోడ్లపై ఉండడంతో చీకట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మున్సిపాలిటీలో నిధుల కొరత
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి వీధి దీపాల నిర్వహణకు నిధుల కొరత ఉందని మున్సిపాలిటీ అధికారులు అంటున్నారు. కరెంటు స్తంభాలపై లైట్లు, వీధి దీపాలు పార్ట్స్, ఎల్ఈడీలు, గ్లాస్ లాంటి పరికరాలు అవసరం అవుతాయని నిధులు లేకపోవడంతోనే వీధి దీపాల నిర్వహణ భారంగా మారిందని అంటున్నారు. నిధుల కోసం అధికారులకు నివేదికలు అందజేశామని తెలిపారు.