ఉట్నూర్, ఆగస్టు 9 : ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ మహనీయుల చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శుక్రవారం ఊట్నూర్‌లోని కుమ్రం భీం ప్రాంగణంలోని కుమ్రం భీం విగ్రహానికి ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పూలామాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడారు. గతంలో కుమ్రం భీం లాంటి మహనీయులు ఆదివాసీల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి సమస్యలు లేవని, చాలా మెరుగుపడ్డామని తెలిపారు. ఆదివాసీలు తమ పిల్లలను చదివించి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని తెలిపారు.
గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు. వాటిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తుందన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పీవో ఖుష్బూ గుప్తా విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విద్యార్థులు కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖు ష్బూ గుప్తా, డీఎఫ్‌వో, నిర్వాహకులు విశ్వంరావు, పుర్క బాపురావు, మెస్రం మనోహర్, మెస్రం దుర్గు, రాజు, పెందూర్ ప్రభాకర్, తి రుపతి, బాలేరావు, శంకర్, గోపి, బొంత ఆశారెడ్డి, విఠల్‌రావు, ప్రభాకర్, ఆదివాసీ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎదులాపురం, ఆగస్టు 9 : ఆదివాసీ సంసృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని వాటిని భావితరాలకు అందించేందుకు ఆదివాసీ దినోత్సవం లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం హీరసుఖ జాగృతి సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. ముందుగా హీరసుఖ దైవానికి పూజలు చేశారు. అనంతరం జెండాను ఆవిషరించి కుమ్రం భీం, రాంజీగోండ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీలతో పాటు సంఘం నాయకులను సతరించారు. ఐటీడీఏను మరింత బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పిప్రి సభలో హామీ ఇచ్చారన్నారు. మంత్రి సీతక సూచన మేరకు ఆదివాసులతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో నిహారిక, హీరసుఖ జాగృతి సమితి అధ్యక్షుడు సిడాం రాంకిషాన్, నాయకులు మేస్రం కృష్ణ, బాపురావ్, ఆత్రం అనసూయ పాల్గొన్నారు.
నేరడిగొండ, ఆగస్టు 9 : ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రత్యేకత ఉందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కుంటాల బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై కుమ్రం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం గోండు వీరుడు కుమ్రం భీం పోరాటం మరువలేనిదని వని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ ఆయన అడుగ జాడల్లో నడవాలని తెలిపారు. పాఠశాలలో నిర్వహించి స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంబారావ్, నాయకులు అశోక్, సురేందర్, ప్రతాప్‌సింగ్, సంతోష్, ఇందల్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.