తాంసి, జూన్ 15: వేసవికాలంలో రైతన్నలు కూరగాయలు అధికం గా సాగు చేస్తారు. వేడి వల్ల మొక్కలకు సరైన విధంగా తేమ అందదు. దీనివల్ల మొక్కలు పొడిబారి పెరగకపోవడం, బలహీనంగా మారి దిగుబడులు తక్కువగా వస్తాయి. దీనికి మల్చింగ్ చక్కని పరిష్కారం.
మల్చింగ్ అంటే..
మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. అదే ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్గా పేర్కొంటారు. ఇప్పటికే పలువురు రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తూ, లాభాల బాటలో పయనిస్తున్నారు.
ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభాలు
కూరగాయలు, పండ్ల తోటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ విధానం వల్ల 30 నుంచి 40 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. మట్టి కోతను నివారించడంతోపాటు నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. భూమిలోని క్రిమికీటకాలు, తెగుళ్లను నివారిస్తుంది. ఎరువుల నష్టాన్ని తగ్గిస్తుంది. నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు (20-25 శాతం) పొందవచ్చు. మొక్కలకు పోషకాలను అధికంగా లభ్యమయ్యేలా చేస్తుంది.
మల్చింగ్ వేసే విధానం..
విత్తనాలు విత్తుటకు ముందు మల్చింగ్ విధానం అవలంబించాలి. ముందుగా నేలను దుక్కి చేసుకొని బెడ్లను తయారు చేసుకోవాలి. ప్లాస్టిక్ షీట్లను బిగుతుగా పరిచి అంచులను మట్టితో కప్పాలి. పంట రకాన్ని బట్టి కావాల్సినంత దూరంలో రంద్రాలు చేసుకోవాలి. రంద్రాల గుండా విత్తుకోవాలి. మల్చింగ్ షీట్లను తగిన పరిమాణంలో కత్తిరించుకోవాలి. మల్చింగ్ షీట్లపై మొక్కల దగ్గర చిన్నచిన్న రంద్రాలు చేసి మొక్కలకు తొడిగించాలి. మార్కెట్లో ముందుగానే రంద్రాలు చేసిన మల్చింగ్ షీట్లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. షీట్లను మలిచి అంచులను మట్టితో కప్పాలి.
పండ్ల తోటలకు మల్చింగ్..
చెట్టు చుట్టూ పాదులు తీయాలి. కత్తిరించిన మల్చీ షీట్లను చెట్టు చుట్టూ పరచాలి. అంచులను మట్టితో కప్పుకోవాలి. కూరగాయలు, పండ్ల మొక్కలకు ప్లాస్టిక్ మల్చింగ్ సాగుతో మేలు జరుగుతుంది. పంట రకం, స్వల్పకాలిక పంటలు(3-4 నెలలు), మధ్యకాలిక పంటలు (ఒక సంవత్సరం), దీర్ఘకాలిక పంటలు (సంవత్సరం కంటే ఎక్కువ) వేసినట్లయితే.. పిల్ముల మందం మైక్రాన్లు, గీజులు, ఎంఎంలు, ఒక కేజీ ఫిల్మ్ పరుచు విస్తీర్ణం చదరపు మీటర్లలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
రూ.1.50 లక్షల లాభం
నేను ఒకటిన్నర ఎకరం పొలంలో మ ల్చింగ్ పద్ధతితో తర్బూజ(పుచ్చకాయ) సాగు చేశా. రూ.లక్ష పెట్టుబడి పెట్టా. పుచ్చకాయలు అమ్మడంతో రూ.2.50 లక్షలు వచ్చాయి. పెట్టుబడి పోనూ రూ.1.50 లక్షలు మిగిలాయి. వ్యవసాయ అధికారులతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు మల్చింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
– ఆనంద్, ఆదర్శ రైతు, పొన్నారి.
జాగ్రత్తలు తప్పనిసరి
మల్చింగ్ వేసేటప్పుడు ఎక్కువ ప్లాస్టిక్‌ను లాగకూడదు. చినిగిపోయే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న సమయం లో ఉష్ణోగ్రతల వల్ల మల్చింగ్ కాగితం సాగుతుంది. గాలి బాగా వీచే సమయంలో మల్చింగ్ చేయకూడదు. ఒకవేళ వేస్తే సరిగ్గా రాకపోవడం వల్ల వదులుగా ఉంటుంది. ఇలా… తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్లాస్టిక్ మల్చింగ్ సాగుతో రైతుకు లాభం చేకూరుతుంది. పూర్తి వివరాలు కోసం కేవీకేలో సంప్రదించాలి.
– ప్రవీణ్‌కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కో ఆర్డినేటర్.