నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63 పనుల్లో నిత్యం ఎక్కడో చోట అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎన్‌హెచ్ విస్తరణలో భాగంగా ఇందారం బీట్ పరిధిలో అనుమ తులు లేకుండా ఇరువైపులా కిలోమీటరున్నర వరకూ మీటర్‌కంటే ఎక్కువ వెడల్పుతో మట్టి తవ్వగా, ఆ మొత్తానికి ఫైన్ వేయాల్సింది పోయి కేవలం 10 నుంచి 15 మీరట్ల వరకే లెక్కగట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మూమూళ్లు తీసుకొని సదరు కాంట్రాక్టర్‌కు లక్షలాది రూపాయలు మిగిల్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంచిర్యాల, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ నుంచి జగ్దల్పూర్ వెళ్లే జాతీయ రహదారి-63 పనుల్లో అటవీ శాఖ అధికారుల వ్యవహారం విమర్శలకు తావిస్తున్నది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీకి వెళ్లే ఎంట్రన్స్ ఆర్చ్ మొదలుకొని.. బస్టాండ్, అరుణక్కనగర్, పోచమ్మగుడి మీదుగా ఎన్‌హెచ్-363 కలిపే బైపాస్‌రోడ్డు వరకు దాదాపు కిలోమీటరున్నర ఉంటుంది. ఎన్‌హెచ్-63 విస్తరణలో భాగంగా మంచిర్యాల రేంజ్ ఇందారం బీట్‌లో పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న రోడ్డు పక్కన.. అటవీ భూముల్లో మీటర్ కంటే ఎక్కువ వెడల్పుతో మట్టి తవ్వారు. కానీ ఈ పనులు చేసేందుకు అటవీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. దీంతో ఫారెస్ట్ అధికారులు వెళ్లి పనులను అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేసినందుకు ఓ వాహనాన్ని సీజ్ చేసి, పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు జరిమానా విధించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మట్టి తవ్వకాలను ఫైన్ వేసే విషయంలో అటవీశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తవ్విన మట్టి మొత్తానికి ఫైన్ వేయకుండా తక్కువ మొత్తానికి వేసి కాంట్రాక్టర్‌కు రూ. లక్షలాది రూపాయాలు మిగిల్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కిలోమీటరున్నర తవ్వితే.. పదిహేను మీటర్లకు కూడా ఫైన్ వేయలే..
రోడ్డు విస్తరణ కోసం అటవీభూములను తవ్విన కాంట్రాక్టర్‌కు దాదాపు రూ. 10 లక్షల వరకు జరిమానా పడాలి. పైగా తవ్విన మట్టిని తరలించిన వాహనాన్ని సీజ్ చేయాలని అటవీ చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. కానీ మంచిర్యాల అధికారులు మాత్రం సదరు కాంట్రాక్టర్‌కు మేలు చేసేలా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. అడవిలో పశువుల కాపర్లు పశువుటు మేపినా, గిరిజనులు వంట చెరుకు తెచ్చుకున్నా కేసులు నమోదు చేసే అధికారులు, ఈ కాంట్రాక్టర్ విషయంలో మాత్రం మామూళ్లు తీసుకొని మిన్నకుండిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిలోమీటరున్నర దూరం దాదాపు మీటర్‌కంటే ఎక్కువ వెడల్పుతో ఫారెస్ట్ భూమి తవ్వితే.. మొత్త కలిపి పదిహేను మీటర్ల వరకే తవ్వినట్లు ఫారెస్ట్ అధికారులు కేసును మార్చేశారు. కేవలం 101.25 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వినట్లు గుర్తించి.. ఆ క్యూబిక్ మీటర్‌కు రూ.971 చొప్పున లెక్కగట్టి రూ.98,314 ఫైన్ వేశారు.
ఈ మేరకు డిప్యూటీ రేంజర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మంచిర్యాల డివిజనల్ ఆఫీసర్ రూ.98,314కు మరో రెండింతలు (వన్ ప్లస్ టూ టైమ్స్) కలుపుకొని రూ.2.94,950 జరిమానా విధించారు. ఇక్కడే గోల్మాల్ జరిగింది. మట్టి తవ్వేందుకు ఫాస్ట్ మూవింగ్ వాహనాన్ని వినియోగిస్తే క్యూబిక్ మీటర్‌కు రూ.4016 చొప్పున ఫైన్ వేయాలి. కానీ ఇక్కడ తవ్వకాలను అడ్డుకున్న సమయంలో ఫాస్ట్ మూవింగ్ సీఎల్జీ 414 లెవలింగ్ గ్రేడర్ వాహవాన్ని సీజ్ చేసిన ఫారెస్టు అధికారులు.. ఫైన్ మాత్రం ఎడ్లబండితో మట్టి తరలిస్తే వేసే రూ.971 చొప్పున వేశారు. వాస్తవానికి రూ.4016 చొప్పున 101.25 క్యూబిక్ మీటర్లకు ఫైన్ వేస్తే రూ.4,06,620 అవుతుంది. దానికి వన్ ప్లస్ టూ టైమ్స్ కలుపుకుంటే రూ.12,19,860 అవుతుంది. కానీ.. ఇక్కడ కట్టించింది మాత్రం రూ.2.94,950 మాత్రమే. అదే మొత్తం కిలోమీటరున్నరను పరిగణలోకి తీసుకుంటే తవ్విన మట్టి కొన్ని వేల క్యూబిక్ మీటర్లలోకి.. దానికి వేయాల్సిన జరిమానా కోట్ల రూపాయాల్లో ఉంటుంది. కానీ అధికారులు అలా చేయకుండా కేవలం కాంట్రాక్టర్‌కు మేలు చేసేలా వ్యవహరించారని ఈ లెక్కలను చూస్తేనే తెలిసిపోతుంది.
ఫిర్యాదును తప్పుతోవపట్టించిన వైనం..
ఈ వ్యవహారంలో ఇందారం డీఆర్వో, మంచిర్యాల ఎఫ్‌డీవో, ఎఫ్ఆర్వో, ఇందారం డీఆర్వోల పాత్రపై నయీంపాషా అనే సామాజిక కార్యకర్త 2023లో మంచిర్యాల డీఎఫ్‌వోకు, హైదరాబాద్‌లోని పీసీసీఎఫ్‌కు ఏకకాలంలో ఫిర్యాదు చేశారు. వచ్చిన ఫిర్యాదును డీఎఫ్‌వో ఎవరిపైనైతే ఫిర్యాదు చేశారో ఎంక్వైరీ చేయమని వారికే ఫార్వర్డ్ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కొన్ని రోజులకు పీసీసీఎఫ్ ఎంక్వైరీ చేసి వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ డీఎఫ్‌వోను ఆదేశించారు. అప్పుడు స్పందించక తప్పని పరిస్థితుల్లో జిల్లా అధికారులు మేము ఏం తప్పు చేయలేదు. నిబంధనల ప్రకారమే ఫైన్ వేశామంటూ ఉన్నతాధికారులనే తప్పుతోవ పట్టించేలా రిపోర్టును అందజేశారు. ఆ రిపోర్టునే డీఎఫ్‌వో మంచిర్యాల సీసీఎఫ్‌కు ఆయన పీసీసీఎఫ్‌కు పంపించారు. కిలోమీటరున్నర దూరం మీటర్ కంటే ఎక్కువ వెడల్పుతో తవ్వితే 101.25 క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే వచ్చిందంటే డీఎఫ్‌వోకు ఎందుకు అనుమానం రాలేదు.
ఆ రోడ్డును ఆయన పరిశీలించి నివేదికను పైకి పంపించారా లేకపోతే కిందిస్థాయి అధికారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే వారిచ్చిన రిపోర్టును అలాగే ఉన్నతాధికారులు పంపించారా అన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. కాగా, కొన్ని రోజులకు ఇదే సామాజిక కార్యకర్త పేరుతో ఇదే విషయమై పీసీసీఎఫ్ ఆఫీసులో గుర్తుతెలియని వ్యక్తులు మరో ఫిర్యాదు ఫైల్ చేశారు. దానిపై విచారణ చేసిన డీఎఫ్‌వో అది ఫోర్జర్జీ సంతకం అని, అసలు ఆ సామాజిక కార్యకర్త ఈ ఫిర్యాదు చేయలేదని రిపోర్టు చేశారు. దీంతో మొత్తం అసలు వ్యవహారాన్నే తప్పుతోవ పట్టించారంటూ సామాజిక కార్యకర్త ఆరోపిస్తున్నారు. నా పేరుపై ఎవరో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు సరే. మరి మొదట నీను ఇచ్చిన ఫిర్యాదును తప్పుతోవ పట్టించేలా రిపోర్టు ఇచ్చిన అధికారులపై విచారణ చేపట్టాలని, వాస్తవాలను గుర్తించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అటవీశాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు.
ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి
అనుమతులు తీసుకోకుండా మట్టి తవ్విన కాంట్రాక్టర్ ఫారెస్ట్ అధికారులు వచ్చి అడ్డుకోవడంతో హడావుడిగా తవ్విన గుంతను పూడ్చేశారు. అప్పటికే కొంత మట్టిన బయటికి తరలించిన కాంట్రాక్టర్‌ను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుంతలు పూడ్చడం ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలు అందులో దిగబడిపోతున్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు సైతం ఈ గుంతలో దిగబడి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రహదారిపై నెలలో ఐదారు రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకులైన జనాలు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు రహదారి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని, వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.