ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 15 : తిర్యాణి మండలం మంగి గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రబండ గిరిజన రైతులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. దినకర్ మాట్లాడుతూ ఎర్రబండకు చెందిన గిరిజన రైతులు 40 ఏళ్లుగా కాస్తు కబ్జాలో ఉన్న భూములను సాగు చేసుకుంటున్నారని, ఆ భూములకు గతంలో రెవెన్యూ అధికారులు పట్టాలు కూడా మంజూరు చేశారన్నారు. ప్రస్తుత తహసీల్దార్ వారి పట్టాలు రద్దు చేసినట్లు తెలపడంతో పాటు వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో గిరిజనుల పట్టాలు తొలగించడంతో వారికి పహనీ, 1బీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు చేసినప్పుడు 15 రోజుల్లో విచారణ జరిపి సమస్య పరిషరిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో నోటీసులు పంపుతున్నారని తెలిపారు. గిరిజన రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల కార్తీక్, గేడం టీకానంద్, కృష్ణమాచారి, తిరుపతి, నిర్వాసిత రైతులు, కినక జన్గు, మర్సుకోల బాజిరావ్, గ్రామ పటేల్ ఆత్రం ఆత్మరావ్, కొర్వేత దేవ్, సోయం చిత్రూ, కినకమాంకు పాల్గొన్నారు.