కదలని బస్సు
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగింది. బుధవారం బస్సులు రోడ్లపైకి రాలేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మిక సంఘాలతో సర్కారు జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లారు.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో డిపోలకే పరిమితం
- పోలీసు పహారా మధ్య రోడ్లపైకి ప్రైవేటు బస్సులు
- తీవ్రమైన ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
- డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాల డిమాండ్
- అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేటు వాహనదారులు
- ఏసీపీ తీరును నిరసిస్తూ మంచిర్యాలలో ఆందోళన
- నేటి నుంచి తీవ్రరూపం దాల్చనున్న సమ్మె
మంచిర్యాల ప్రతినిధి, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగింది. బుధవారం బస్సులు రోడ్లపైకి రాలేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మిక సంఘాలతో సర్కారు జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడవలేదు. ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సులతోపాటు ప్రైవేటు బస్సులు కూడా నిలిచాయి. తెల్లవారుజాము నుంచే బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, భైంసా డిపోల నుంచి బస్సులు కదల్లేదు.
ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు బుధవారం ఉదయం నుంచి బస్సు డిపోలు, బస్టాండ్లలో నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని కోరారు. సర్కారు దిగొచ్చే వరకు సమ్మె సాగుతుందని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వరకు సర్కారు స్పందించని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు బస్టాండ్లు బోసిపోయి కనిపించాయి.
బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చివరకు ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. సమ్మె నేపథ్యంలో డిపోలు, బస్టాండ్లలో పోలీసు పహారాలు కనిపించాయి. డిపోల్లో అద్దె బస్సుల యాజమానులతో చర్చలు జరిపి, బస్సులు నడపాలని కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రైవేటు అద్దె బస్సుల సర్వీసులు నడిచాయి. కాకపోతే రోజు నడిచిన బస్సుల్లో సగం బస్సులు కూడా రోడ్లపైకి రాలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ప్రైవేటులో అధిక చార్జీలు
ఆర్టీసీ సమ్మెతో ప్రైవేటు వాహనాలకు డిమాండ్ పెరిగిం ది. సాధారంగా తీసుకునే చార్జీల కంటే అధిక చార్జీలు వ సూలు చేశారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా కారులో ప్రయాణించాలంటే రూ.600లు తీసుకునే క్యాబ్ డ్రైవర్లు.. బుధవారం ఉదయం రూ. 900 నుంచి రూ.1000 వరకు తీసుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. హైదరాబాద్‌కు వెళ్లే క్యాబ్‌లు దా దాపు డబుల్ చార్జీలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు అనేక వ్యయప్రయాసాలకోర్చి ప్రయాణాలు సాగించారు.
బస్సుల లేమితో స్థానికంగా నడిచే ఆటోలకు డి మాండ్ పెరిగింది. ఇన్ని రోజులు తీసుకున్న చార్జీల్లో స గం వరకు పెంచి తీసుకున్నారు. ప్రైవేటు ఆర్టీసీ అద్దె బ స్సులు నడుస్తున్నప్పటికీ ప్రైవేటు వాహనాల యాజమానులు, డ్రైవర్లు అధిక చార్జీల విషయలో వెనక్కి తగ్గలేదు. సమ్మె తీవ్రమైతే ప్రైవేటు చార్జీలు పెరిగే అవకాశాలు ఉండడంతో ఆందోళన కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు వెలవెలబోయాయి. బస్సులు రాకపోవడంతో గంటల కొద్ది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలుపగా.. వీరికి బీఆర్ఎస్ తరఫున మాజీ జడ్పీటీసీ రాథోడ్ చారులత మద్దతు తెలిపారు. నిర్మల్ డిపో పరిధిలో ఆయా బస్సులను మహాలక్ష్మి పథకం కింద మహిళల కోసం నడుపుతున్నామని, పురుషులూ టికెట్ తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో 427 మందికి పైగా కార్మికులు పాల్గొంటున్నారు. రెండు డిపోల పరిధిలో గల బస్సులు రోజు లక్ష కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, సమ్మె కారణంగా రూ.60 లక్షల వరకు సంస్థ ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

మంచిర్యాలలో ప్రైవేటు డ్రైవర్ల ఆందోళన
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంచిర్యాల డిపోలో ప్రైవేటు అద్దె బస్సులు నడిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆర్టీసీ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రైవేటు బస్సుల యాజమానులతో చ ర్చలు జరిపారు. ప్రైవేటు బస్సులు నడిపే డ్రైవర్లే టిమ్ స ర్వీస్ కూడా చేయాలని, డ్రైవింగ్ చేస్తూ టికెట్లు ఇవ్వాలని చెప్పారు. దీంతో ప్రైవేటు అద్దె బస్సులు నడిపే డ్రైవర్లు ఆందోళన చెందారు. బస్సు నడపమంటే నడుపుతాం. కానీ.. టికెట్లు కూడా మమ్ములనే ఇవ్వమంటే కుదరదని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మంచిర్యాల డిపో లోపల ఉన్న తన యాజమానికి విషయం చెప్పుందుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌ను మంచిర్యాల ఏసీపీ అడ్డుకున్నారు. చెప్పిన డ్రైవర్ వినకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఏసీపీ సదరు డ్రైవర్‌ను నెట్టివేశాడు. దీంతో ఏసీపీ తీరును నిరసిస్తూ ప్రైవేటు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఏసీపీ వచ్చి వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. డ్రైవింగ్ చేస్తూ టికెట్లు ఇచ్చేందుకు ప్రైవేటు డ్రైవర్లు అంగీకరించకపోవడంతో చివరకు ఉచితంగా ఎలాంటి చార్జీలు తీసుకోకుండానే ప్రైవేటు అద్దె బస్సులు నడిపించారు.
ప్రధాన డిమాండ్లు..
- ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
- ఆర్థిక పరమైన అంశాలు అమలు చేస్తూ, ప్రస్తుత సౌకర్యాలు యథావిధిగా ఉంచి ప్రభుత్వంలో విలీనం చేయాలి.
- 2021 వేతన సవరణ అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందజేయాలి.
- 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి.
- కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
- ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
- సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేసి రాయితీల కోసం, సంస్థ అభివృద్ధికి యేటా బడ్జెట్లో మూడు శాతం డబ్బులు కేటాయించాలి.
- ఎలక్ట్రీకల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి.
- మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్‌కు బదులుగా మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలి. అలాగే ఈ పథకం కోసం నెలకు రూ.400 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి.
- ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి.
- అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసి అర్హులైనవారికి పదోన్నతులు కల్పించాలి.
- పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలి.
- అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న రిటైర్డ్ అధికారులు, సూపర్ వైజర్లను తొలగించి వారి స్థానాలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 22 :ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలి. కాంట్రాక్టు , అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. ఆర్టీసీ కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి సమ్మెకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నాం. -తోట సత్తయ్య, జేఏసీ కోకన్వీనర్ , మంచిర్యాల
ఉట్నూర్‌కు పోవాలే..బస్సులు లేవు..
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్22 : నేను ఉట్నూర్‌కు పోదామని ఆసిఫాబాద్ బస్టాండ్‌కు పొద్దున వచ్చిన. అప్పటి నుంచి ఒక్క బస్సు కూడా రాలే. ఎందుకని అడిగితే డ్రైవర్లు, కండక్లర్లు డ్యూటీలకు రాలేదంటుండ్రు. అందుకే బస్సులు నడుస్తలేవని చెబుతుండ్రు. ఆటోలు, టాటా ఏస్ బండ్లు కూడా ఉట్నూర్‌కు పోతలేవు. నేను ఇంటికి ఎట్లా పోవాలో ఏమో తెలుస్తలేదు.
-మానూ బాయి, ఉట్నూర్
పొద్దున నుంచి..
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 22 : మేమంతా ఛత్తీస్‌గఢ్ నుంచి జగిత్యాలకు వెళ్లేందుకు మంచిర్యాల బస్టాండుకు ఉదయం రైలు దిగి ఆరు గంటలకు వచ్చాం. 8 గంటల కల్లా పనులకు వస్తామని మా మేస్త్రీకి చెప్పాం. ఆయన ఫోన్ చేస్తూ కోపగించుకుంటున్నాడు. బస్సులు నడవడం లేదంటే నమ్మడం లేదు. ఎలాగైనా రావాలని చెబుతున్నాడు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంత మొత్తం ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాం.
– ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కూలీలు
స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 22 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, సమస్యలను పరిషరించాలని కోరు తూ యాజమాన్యానికి కార్మికులు అనేక సార్లు విన తిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. దీనిపై 48 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించలే దు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలని కాదని గత్యంతరం లేక సమ్మె చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– ఏఐటీయూసీ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్
కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 22 : కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల సమయంలో ఎన్నో హామీలిచ్చి అధికా రంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికే పలుమార్లు కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర నాయ కత్వం ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మెను కొనసాగిస్తాం. అద్దె బస్సులను నడిపించి సంస్థను మరింత నష్టాల్లోకి తీసుకెళ్తున్నారు. సమ్మెను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆర్టీసీ కార్మికులమంతా ఐక్యతతో ముందుకు పోతాం.
– బొట్టు లక్ష్మణ్, మంచిర్యాల జేఏసీ చైర్మన్
ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలి
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 22 : రెండున్నరేళ్లుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములయ్యారు. కానీ ప్రభుత్వం మాత్రం కార్మికుల సమస్యల పరిష్కరించడానికి మాత్రం సమయం లేదని, కమిటీలు వేస్తున్నామని, ఏవేవో మాటలు చెబుతున్నది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సమ్మె చేపట్టినం. ఇప్పటికైనా ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచనను విరమించుకొని, సమస్యలు పరిష్కరించాలి.
– ఉమారాణి, జేఏసీ మహిళా నాయకురాలు, మంచిర్యాల
రెండున్నర గంటలైనా..
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 22 : బస్సుల బంద్‌తో చాలా ఇబ్బందిగా ఉంది. బెల్లంపల్లి నుంచి చెన్నూర్‌కు వెళ్లడం కోసం ఉదయం ఏడు గంటలకే మంచిర్యాల బస్టాండుకు వచ్చిన. తొమ్మిదిన్నర అవుతున్నది. ఒక్క బస్సు కూడా రాలేదు. దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన నేను ఇక్కడే బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం చొరవ తీసుకుని బస్సులు యధావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలి.
– తిరుపతి, బెల్లంపల్లి

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

