కెరమెరి, మార్చి 12 : వేసవిలో తాగునీటికీ ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కెరమెరి మండలం ధనోరలోని డబ్ల్యూటీపీని సందర్శించి మిషన్ భగీరథ ఈఈ రాకేశ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో ప్రతీ గ్రామానికీ భగీరథ నీరందేలా చర్యలు తీసుకోవాలని, ఎకడైనా సమస్యలుంటే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మిషన్ భగీరథ ఈఈ రాకేశ్ ఉన్నారు.
‘పది’ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి
పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను అన్ని విధాలా సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కెరమెరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.హెచ్ఎం ప్రకాశ్‌తో మాట్లాడారు. ప్రతి రోజూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు.