ఆ ఎస్సీ కాలనీవాసులను తాగు నీటి సమస్య వెంటాడుతున్నది. ఇటు బోరు బావి పాడైపోయి.. అటు మిషన్ భగీరథ నీరు రాక పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. నిత్యం పనులన్నీ వదులుకొని స్థానికంగా ఉన్న వ్యవసాయబావి వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
కోటపల్లి, మార్చి 16 : కోటపల్లి మండలం షట్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో సుమారు 30 కుటుంబాలు ఉంటాయి. ఈ కాలనీకి తాగు నీరు సరఫరా చేసే బోరు బావి ఆరు నెలల క్రితం పాడైపోయింది. అలాగే మిషన్ భగీరథ పైప్‌లైన్ కూడా పనిచేయకపోవడంతో కాలనీవాసులు సమీపంలోనున్న వ్యవసాయ బోరుబావిపై ఆధారపడాల్సి వస్తున్నది. ఒకే ఒక్క వ్యవసాయ బావి ఉండడం వల్ల పనులన్నీ వదులుకొని అక్కడికి చేరుకొని తాగు నీటి కోసం పోటీ పడుతూ గొడవలు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అప్పుడప్పుడూ గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరు తీసుకొస్తుండగా, కాలనీ మొత్తానికి సరిపోవడం లేదని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలాగని వారు ఆందోళన చెందుతున్నారు.
ఎస్సీ కాలనీ వరకు మిషన్ భగీరథ పైప్‌లైన్ ఉన్నప్పటికీ నీరు సరఫరా కావడం లేదు. అధికారులు పైప్‌లైన్‌కు మరమ్మతులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాగునీరు సరఫరా అవుతుందని అధికారులు చెబుతుండగా, చుక్క నీరు అందడం లేదని కాలనీ వాసులు స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని తాగు నీటి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఈ ఫొటోలోని దివ్యాంగుడి పేరు మాసు మల్లయ్య. ఇతనిది కోటపల్లి మండలం షట్పల్లిలోని ఎస్సీ కాలనీ. నెలల తరబడి తాగు నీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నిత్యం తన వాకర్ సాయంతో సమీపంలోని వ్యవసాయ పంప్‌సెట్ వద్దకు వెళ్లి తాగు నీరు తెచ్చుకుంటున్నాడు. బోరుబావి పనిచేయక.. మిషన్ భగీరథ నీరు రాక ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమస్య పరిష్కరించాలని కాలనీవాసులంతా వేడుకున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడని వాపోతున్నాడు.
మా కాలనీకి తాగునీరు సరఫరా కావడం లేదు. బోరుబావిని మంచిగ చేసేటోళ్లు లేక ఆరు నెలలుగా అరిగోస పడుతున్నం. మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా నీరు రావడం లేదు. బిందెడు నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తున్నది. వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి తాగు నీరు తెచ్చుకుంటున్నం. మహిళలు రోజూ కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా తిప్పలు పట్టించుకున్నోళ్లు లేరు.
– మాసు లక్ష్మి, షట్పల్లి
మా ఎస్సీ కాలనీకి మిషన్ భగీరథ పైపులైన్ ఉంది. కానీ మా వరకు నీళ్లు రావడం లేదు. ఇప్పటి దాకా బోరుబావి నీళ్లు తాగినం. అది ఆరు నెలల కింద పాడైపోయింది. అప్పటి నుంచి అవస్థలు పడుతున్నం. అధికారులు పట్టించుకోవడం లేదు. అసలే ఎండాకాలం.. తాగు నీటి కోసం తల్లడిల్లుతున్నం. ఇకనైనా మా గోస తీర్చాలి.
– అగాడి భీమక్క, షట్పల్లి
మా కాలనీకి తాగు నీరిచ్చేటోళ్లు లేరు. ప్రతి రోజూ మస్తు తిప్పలైతంది. అధికారులు రావడం.. చూసి వెళ్లడం తప్ప చేసిందేమీ లేదు. ఆరు నెలలుగా గిదే గోస. మస్తు తిప్పలైతంది. ఇటు మిషన్ భగీరథ నీళ్లియ్యరు. అటు బోరుబావి మంచిగ చేపించరు. ఇలాగైతే మేమెట్లా బతకడం.
– మాసు రాజక్క, షట్పల్లి
ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులు చేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటిని అందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– విద్యాసాగర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, చెన్నూర్