ఎదులాపురం, డిసెంబర్ 27 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారీగూడ కాలనీవాసులను మోసం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాలనీవాసులతో మంగళవారం సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాలనీవాసులు గజమాలతో సత్కరించారు. కాలనీలో ముఖ్య నాయకులు పలు సమస్యలును ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కాలనీవాసులకు పట్టాలు ఇప్పిస్తామని ఇందుకోసం మున్సిపల్ ఎదుట ధర్నా చేద్దామని రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారన్నారు. కాలనీవాసులకు పట్టాలు , ఇంటి నంబర్లు ఇచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వామేనని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయవద్దని కాలనీవాసులకు వివరించారు.
రెండు రోజుల్లో మున్సిపల్ అధికారులు ఇంటింటా సర్వే చేపట్టి ఇంటి నంబర్లు ఇస్తారని స్పష్టం చేశారు. అలాగే రూ.10 కోట్లతో కాలనీని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై బీజేపీ నాయకులను నిలదీయాలని సూచించారు. కేంద్రంలో ఉద్యోగాల ఊసే లేదేని, కానీ బీఆర్ఎస్ హయాంలో 18 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, మైనార్టీ నాయకులు సాజీద్ ఉద్దీన్, సలీంపాషా, కోఆప్షన్ సభ్యుడు ఎజాజ్, బంగారీగూడ కాలనీ సభ్యుడు మల్లయ్య, సత్యనారాయణ, చంద్పాషా తదితరులు ఉన్నారు.
పార్టీ సిద్ధాంతాలే బీఆర్ఎస్కు బలం
ఎదులాపురం, డిసెంబర్ 27 : పార్టీ సిద్ధాంతాలే బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) కి బలమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ వనజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో కలిసి 128 షాదీముబారక్, 68 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, మహిళా కౌన్సిలర్లు, నాయకులు, వార్డుల్లో తిరుగుతూ అర్హులకు అందేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను తరచూ సందర్శిస్తూ గర్భిణులు , పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పార్టీ పేరు మార్పుపై ప్రజలతో చర్చించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.